సంచలనం: పరిటాల ఓటమికి బోయలు నిర్ణయం

First Published Feb 26, 2018, 11:55 AM IST
Highlights
  • ఎన్నికలు దగ్గరపడేకొద్దీ అనంతపురం జిల్లా రాజకీయాలు బాగా వేడిక్కిపోతున్నాయి.

ఎన్నికలు దగ్గరపడేకొద్దీ అనంతపురం జిల్లా రాజకీయాలు బాగా వేడిక్కిపోతున్నాయి. అందులో కూడా రాప్తాడు ఎంఎల్ఏ, మంత్రి పరిటాల సునీత, కొడుకు పరిటాల శ్రీరామ్ కేంద్రంగా రాజకీయ సమీకరణలు చాలా వేగంగా మారిపోతున్నాయ్. ఆదివారం రప్తాడు నియోజకవర్గంలో జరిగిన ఓ పరిణామం పరిటాల కుటుంబంపై జనాల్లో ఉన్న వ్యతిరేకత బయటపడింది. జిల్లాలోని బోయ-వాల్మీకి సామాజికవర్గానికి చెందిన సమావేశం రాప్తాడులో జరిగింది. ఆ సందర్భంగా మాట్లడిన వక్తల్లో చాలామంది పరిటాల కుటుంబంపై విరుచుకుపడటం గమనార్హం.

గడచిన మూడున్నరేళ్ళల్లో పరిటాల శ్రీరామ్ చేసిన అఘాయిత్యాలు, పరిటాల కుంబుంబం వల్ల నష్టపోయిన కుటుంబాలు, బాధితుల ప్రస్తుత పరిస్దితిపైనే చర్చ జరిగింది. అందులో కూడా బోయ-వాల్మీకి సామాజికవర్గంపై పరిటాల కక్షగట్టినట్లు వ్యవహరిస్తోందంటూ సామాజికవర్గంలోని నేతలు చాలామంది మండిపడ్డారు. పరిటాలకుటుంబం వల్ల నష్టపోయిన బోయ-వాల్మీకి కుటుంబాల్లో కొన్ని కుటుంబాల గురించి ఓ పాంప్లెట్ ప్రచురించి సమావేశంలో పంచటం కలకలం రేగింది. బోయ సూర్యం పేరుతో పాంప్లెట్ ను ముద్రించి పంచారు.

ఆదివారం జరిగింది సామాజికవర్గ సమావేశమే అయినప్పటికీ అందులో వైసిపి, టిడిపి నేతలు కూడా పాల్గొన్నారు. పాల్గొన్నవారిలో కానీ మాట్లాడిన వారిలో అత్యధికులు వైసిపికి మద్దతుగా నిలచిన వారే కావటం గమనార్హం. అందులోనూ పలువురు మాట్లాడిందాంట్లో తప్పేమీ లేదు కాబట్టి టిడిపి నేతలు కూడా ఖండించలేకపోయారట. దాంతోనే సామాజికవర్గంలో పరిటాల కుటుంబంపై ఏ స్ధాయిలో మంటలు మండుతున్నాయో అర్ధమైపోతోంది.

నియోజకవర్గం మొత్తం మీద సుమారు 2.5 లక్షల ఓట్లుంటాయి. అందులో బిసి ఓట్లే దాదాపు 1.25 లక్షలుంటాయి. అందులోనూ బోయ-వాల్మీకుల ఓట్లు సుమారు 40 వేలు. పోయిన ఎన్నికల్లో పరిటాల సునీత మీద ప్రత్యేకంగా వ్యతిరేకత లేకపోయినా సునీత అతికష్టం మీద గెలిచారు. అటువంటిది గడచిన మూడున్నరేళ్ళల్లో సునీత వ్యవహారశైలి మీద బాగా వ్యతిరేకత వచ్చేసింది. అందులోనూ కొడుకు శ్రీరామ్ అరాచకాలు చేస్తున్నట్లు బాగా ప్రచారంలో ఉంది.

దానికితోడు ప్రభుత్వ వ్యతిరేకత ఎలాగూ స్పష్టంగా కనబడుతోంది. ఇటువంటి నేపధ్యంలోనే వచ్చే ఎన్నికల్లో పరిటాల కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేయాలని బోయ-వాల్మీకి సామాజికవర్గం మెజారిటి నేతలు చెప్పటం సంచలనంగా మారింది. పరిస్ధితులు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో పరిటాల కుటుంబం అంటే సునీత కావచ్చు శ్రీరామూ కావచ్చు గెలవటం అంత సులభం కాదని అర్ధమైపోతోంది.

 

click me!