అమరావతి: సోషల్ మీడియాలో జడ్జిలపై అసభ్య పోస్టుల కేసును సీబీఐకి అప్పగిస్తూ ఏపీ హైకోర్టు సోమవారం నాడు ఆదేశాలు జారీ చేసింది.
అమరావతి: సోషల్ మీడియాలో జడ్జిలపై అసభ్య పోస్టుల కేసును సీబీఐకి అప్పగిస్తూ ఏపీ హైకోర్టు సోమవారం నాడు ఆదేశాలు జారీ చేసింది.ఈ కేసుపై ఎనిమిది వారాల్లో నివేదిక అందించాలని సీబీఐకి ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
సోషల్ మీడియాలో ఇటీవల జడ్జిలను దూషించిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది.సీబీఐకి సహకరించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు.
న్యాయమూర్తులు, న్యాయస్థానాలపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై దాఖలైన పిటిషన్లపై విచారణను ఈ నెల 8వ తేదీన ఏపీ హైకోర్టు పూర్తి చేసింది.తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసుపై ఇవాళ తీర్పును ఉన్నత న్యాయస్థానం వెల్లడించింది.
ప్రజాస్వామ్యం నిలబడాలంటే కోర్టులు, ధర్మాసనం, న్యాయస్థానాలు, ప్రభుత్వం, అధికారులు కలిసి పనిచేయాల్సిన అవశ్యకతను హైకోర్టు ఆరోజున అభిప్రాయపడింది.ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎంపీలు విజయసాయిరెడ్డి, నందిగం సురేష్ కోర్టుల తీర్పులపై చేసిన వ్యాఖ్యలను ఆ రోజున ధర్మాసనం విచారించింది.
ఈ కేసు విచారణను సీఐడీ విచారిస్తోంది. అయితే ఈ విచారణలో ఎలాంటి పురోగతి లేనందున సీబీఐకి అప్పగిస్తూ ఏపీ హైకోర్టు ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 8వ తేదీన జరిగిన విచారణ సమయంలో సీబీఐకి అప్పగిస్తే ఏమైనా ఇబ్బందులున్నాయా ఏపీ హైకోర్టు ప్రశ్నించింది.
అయితే సీబీఐకి విచారణ కోసం అప్పగిస్తే తమకు అభ్యంతరాలు లేవని సీఐడీ తరపు న్యాయవాది తెలిపారు. దీంతో ఇవాళ సీబీఐ విచారణకు ఏపీ హైకోర్టు ఆదేశించింది.ఈ కేసు విచారణ డిసెంబర్ 14వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.ఈ విషయమై విచారణ నివేదికను ఇవ్వాలని సీబీఐని ఆదేశించింది ఏపీ హైకోర్టు.