గోదావరి వరదల మీద ఏపీ సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. మరో 24 గంటలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులను హెచ్చరించారు. ముంపు ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలించి.. ప్రతి కుటుంబానికి రూ.2వేలు లేదా వ్యక్తికి రూ. వేయి చొప్పున అందించాలని తెలిపారు.
అమరావతి : గోదావరి వరదలు, సహాయ కార్యక్రమాలపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. శనివారం ఉదయం అధికారులతో సీఎం మాట్లాడారు. గోదావరి వరద ప్రవాహం, తాజా పరిస్థితిపై ఆరా తీశారు. ముంపు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపుపై సీఎంకు అధికారులు వివరాలందించారు. వరదల వల్ల ఎక్కడా కూడా ఎలాంటి ప్రాణనష్టం ఉండకూడదని సీఎం స్పష్టంచేశారు. అవసరమైనంత మేర సహాయక బృందాలను వినియోగించుకోవాలని సీఎం ఆదేశించారు.
మరో 24 గంటలపాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. సహాయ శిబిరాల ఏర్పాటు, సౌకర్యాల కల్పనలో తగిన చర్యలు తీసుకోవాలని, సేవలు నాణ్యంగా ఉండాలని సీఎం స్పష్టంచేశారు.
వరద బాధిత కుటుంబాలకు రేషన్ పంపిణీ చేయాలని, యుద్ధ ప్రాతిపదికిన అన్నికుటుంబాలకు చేర్చాలన్న సీఎం తెలిపారు. ప్రతి కుటుంబానికీ 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ బంగాళాదుంపలు, కిలో పామాయిల్, కేజీ ఉల్లిపాయలు అందించాలని జగన్ తెలిపారు.
undefined
అలాగే ప్రతి కుటుంబానికి రూ.2వేలు లేదా వ్యక్తికి రూ. వేయి చొప్పున శిబిరాలు విడిచి వెళ్లేలోగానే పంపిణీచేయాలన్న సీఎం తెలిపారు. అన్ని పనులకంటే ఈ పనులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు.ప్రతి గంటకూ వరద పరిస్థితిపై తనకు నివేదించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.
వరదల్లోనే పెళ్లి... పడవలో అత్తారింటికి వధువు..!
ఇదిలా ఉండగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరుగుతున్న వరద సహాయ చర్యల్లో తీవ్ర అపశృతి చోటు చేసుకుంది. భద్రాద్రి జిల్లా బూర్గంపాడులో వరద బాధితులను తరలిస్తున్న నాటు పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో పడవలో పది మంది ఉన్నారు. పడవ బోల్తా పడడాన్ని గమనించిన జాలర్లు , స్థానికులు వెంటనే అప్రమత్తమై తొమ్మిది మందిని కాపాడారు. ఒకరు గల్లంతయ్యారు. కనిపించకుండా పోయిన వ్యక్తి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. గల్లంతయిన వ్యక్తిని వెంకట్‌గా గుర్తించారు.
కాగా, మరోవైపు భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం చూపిస్తోంది. శుక్రవారం 70 అడుగులపైనే ప్రవాహం కొనసాగింది. ఇలా 70 అడుగులకు గోదావరి ప్రవాహం చేరడం ఇది మూడోసారి. మొదటిసారి 1986లో గోదావరి భద్రాచలం దగ్గర 75.6 అడుగులకు చేరుకుంది. రెండోసారి 1990లో 70 అడుగులకు చేరింది. తాజాగా మూడోసారి శుక్రవారం 70 అడుగులకు చేరింది. ప్రస్తుతం 70 అడుగులకుపైనే వరద పోటెత్తే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో.. భద్రాచలం పరిసరప్రాంతాల్లోని ఎగువన కురిసిన వర్షాలతో రాష్ట్రంలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.