
Surrogate mother-maternity leave: సరోగసి (అద్దెగర్భం) ద్వారా తల్లులు అవుతన్న మహిళలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సరోగసి (అద్దె గర్భం) ద్వారా తల్లి అయిన మహిళలు ప్రసూతి సెలవులు పొందడానికి అర్హులుగా ఉంటారని ఆంధప్రదేశ్ హైకోర్టు పేర్కొంది. న్యాయస్థానాని ఆశ్రయించిన సదరు మహిళకు ప్రసూతి సెలవులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఏడాది మార్చి 8న ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 33లోని నిబంధనలకు లోబడి ఆ కోర్టును ఆశ్రయించిన సదరు మహిళకు అడాప్షన్ లీవ్/మెటర్నిటీ లీవ్ (మాతృత్వపు సెలవు)లు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
ఉప్పలపాడు జిల్లాపరిషత్ హైస్కూల్ స్కూల్‌అసిస్టెంట్ పి.సౌధామణి అరోగసి ద్వారా ఇటీవలే తల్లి అయ్యారు. ఈ క్రమంలోనే ఆమె ప్రసూతి సెలవుల కోసం చేసిన అభ్యర్థనను సంబంధిత శాఖ అధికారులు తిరస్కరించడంతో హైకోర్టును ఆశ్రయించారు. సౌదామణి, ఆమె భర్త మరొక మహిళతో అద్దె గర్భం కోసం ఒప్పందం చేసుకున్నారు. ప్రసవానంతరం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 33 ప్రకారం బిడ్డను దత్తత తీసుకున్నారు. మెటర్నిటీ బెనిఫిట్ చట్టం ప్రకారం 180 రోజుల పాటు పిల్లల దత్తత సెలవు కోసం సౌదామణి దరఖాస్తు చేసుకుంది. అయితే, సెలవు దరఖాస్తును ఆమె ఉన్నతాధికారులు తిరస్కరించారు.
దీంతో ఆ ఉపాధ్యాయురాలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది నర్రా శ్రీనివాస్ .. మెటర్నిటీ బెనిఫిట్ చట్టం ప్రకారం కమీషన్ చేసే తల్లి ప్రసూతి సెలవులకు అర్హులని హైకోర్టుకు తెలిపారు. మూడు నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న బిడ్డను లేదా కమీషన్ చేసే తల్లిని చట్టబద్ధంగా దత్తత తీసుకున్న మహిళ 12 వారాల పాటు ప్రసూతి ప్రయోజనాలకు అర్హులని జస్టిస్ కె విజయ లక్ష్మి గమనించారు. పిటిషనర్‌కు అనుమతి ఇవ్వాలని ప్రతివాదులను ఆదేశిస్తూ, కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని కోరిన కోర్టు, ఎనిమిది వారాల తర్వాత తదుపరి విచారణకు వాయిదా వేసింది. పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి, గుంటూరు జిల్లా డీఈవో, పెదనందిపాడు ఎంఈవోకు నోటీసులు కూడా అందించారు.
కాగా, ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైకాపా ప్రభుత్వం ప్రసూతి సెలవులకు సంబంధంచి వివరాలను వెల్లడిస్తూ ఏడాది మార్చి 8న జీవో నెంబర్ 33ని చైల్డ్ అడాప్షన్ లీవ్ పేరుతో తీసుకుచ్చింది. దీని ప్రకారం పురుష ఉద్యోగులకు సైతం చైల్డ్ కేర్ సెలవులను 60 రోజుల నుంచి 180 రోజులకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అలాగే, పిల్లల దత్తతకు సంబంధించిన సెలవులను సైతం పేర్కొంది. ఇద్దరు పిల్లల కంటే తక్కువ ఉన్న మహిళా ప్రభుత్వోద్యోగులకు పిల్లల దత్తత సెలవును 180 రోజుల వరకు మంజూరు చేయాలని ప్రభుత్వం ఈ జీవో తో స్పష్టం చేసింది. ఆమె చట్టబద్ధంగా ఒక సంవత్సరం వరకు పిల్లలను దత్తత తీసుకుంటే ఇవి వర్తిస్తాయని కూడా తెలిపింది. పిల్లలను దత్తత తీసుకున్న 6 నెలల వ్యవధిలోపు ఒంటరి పురుష ఉద్యోగులకు (అవివాహితులు/వితంతువు/విడాకులు తీసుకున్నవారు) 15 రోజుల వరకు పితృత్వ సెలవులను ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఈ సమయంలో వేతనానికి సమానంగా సెలవు జీతం చెల్లించాలి.