చిరుధాన్యాలకు ప్రోత్సాహం.. ఆర్గానిక్ ఉత్పత్తులకు సర్టిఫికేషన్.. సాగుపై సమీక్షలో సీఎం జగన్

By telugu teamFirst Published Sep 1, 2021, 6:16 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి సాగు రంగంపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలని, ఆర్గానిక్ ఉత్పత్తులకు సర్టిఫికేషన్ కోసం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ సలహా మండళ్ల ద్వారా అన్నదాతల సమస్యలు నేరుగా ఉన్నతాధికారులకు చేరాలని, వాటిని బాధ్యతగా తీసుకుని వెంటనే పరిష్కరించాలన్నారు. ఎరువులు, విత్తనాలు సకాలంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్నదాతలకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.
 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యవసాయరంగంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వర్షపాతం, పంటలసాగు, ఈ-క్రాపింగ్, వ్యవసాయ మండళ్ల సమావేశాలు, ఎరువుల పంపిణీ, వ్యవసాయ విస్తరణ కార్యక్రమాలు, ఆర్బీకే అంశాలను సమీక్షించారు. చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆర్గానిక్ ఉత్పత్తులకు సర్టిఫికేషన్ వచ్చేలా చూడాలని, అలాగే, మంచి ధర పలికేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయ సలహా మండళ్లలో వ్యక్తమవుతున్న అభిప్రాయాలు, సమస్యలు నేరుగా కలెక్టర్ల దృష్టికి చేరాలని, అధికారులూ వాటిని వెంటనే పరిష్కరించాలని అన్నారు. ఎరువులు, పురుగుల మందులు, విత్తనాలు సకాలంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్నదాతలకు అందాలని తెలిపారు. డిసెంబరులో వైఎస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ ప్రారంభమవుతాయని వివరించారు. వీటితోపాటు ఈ-క్రాపింగ్, వైఎస్సార్ పొలంబడి, ట్రాన్స్‌ఫార్మర్ల సమస్యలపైనా చర్చించారు.

వ్యవసాయరంగంపై సమీక్షా సమావేశంలో అధికారులు రాష్ట్రంలోని సాగు వివరాలను సీఎం జగన్ మోహన్ రెడ్డికి అందించారు. రాష్ట్రవ్యాప్తంగా అంచనాల కంటే ఎక్కువగానే వర్షం కురిసిందని, నెల్లూరు మినహా అన్ని జిల్లాల్లో సాధారణ లేదా అధిక వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. అయితే, సాగు కొంచెం వెనుకంజ వేసిందని వివరించారు. ఇప్పటి వరకు 76.65 లక్షల ఎకరాల్లో సాగు కావాల్సి ఉండగా, 67.41 లక్షల ఎకరాల్లోనే సాగు మొదలైందని తెలిపారు. మిగిలిన చోట్లా విత్తనాలు వేగంగా పడుతున్నాయని తెలిపారు. వ్యవసాయ సలహామండళ్లలో రాష్ట్రవ్యాప్తంగా లక్ష మందికిపైగా రైతులు ఉన్నారని వివరించారు.

సీఎం జగన్ చిరుధాన్యాల గురించి మాట్లాడుతూ రాష్ట్రంలో చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలని, వరికి బదులు వీటిని సాగు చేస్తే మంచి ఆదాయం వస్తుందన్న అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే సాగు చేస్తున్న రైతులను మరింత ప్రోత్సహించాలని సూచించారు. వ్యవసాయ సలహామండలి సమావేశాల్లో రైతులు చెబుతున్న సమస్యలు అధికారులు కచ్చితంగా బాధ్యతగా తీసుకుని పరిష్కరించాలన్నారు.

రైతు భరోసా కేంద్రాల ద్వారా కర్షకులు కోరిన ఎరువులు, మందులు, విత్తనాలు సకాలంలో అందుబాటులో ఉంచాలని, ఆ మేరు కేంద్రాలను మెరుగుపరచాలని సీఎం జగన్ సూచించారు. ఈ కేంద్రాల ద్వారా రైతు సమస్యలు నేరుగా ఉన్నతాధికారులకు తెలిసేలా చర్యలలు తీసుకోవాలన్నారు. నేచురల్ ఫార్మింగ్‌పై రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఆర్బీకే కేంద్రాలకు అనుసంధానంగా చిన్నచిన్న గోడౌన్లు ఏర్పాటు చేసుకోవాలని, తద్వారా అక్కడే విత్తనాలు, ఎరువులను నిల్వ చేసుకోవడం వీలవుతుందని చెప్పారు. ఆర్బీకేల్లో అగ్రికల్చర్ కాలేజీలు, యూనివర్సిటీ విద్యార్థులు విధిగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఆర్గానిక్ ఉత్పత్తులకు సర్టిఫికేషన్ వచ్చేలా చూడాలని, మోతాదుకు మించి ఎరువులు వాడుతున్న ప్రాంతాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఆయా చోట్ల పొలం బడుల ద్వారా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ-క్రాపింగ్ చేసిన రైతులకు భౌతిక రశీదులు, డిజిటల్ రశీదులు కూడా ఇవ్వాలని స్పష్టం చేశారు. గ్రామ సచివాలయాల్లోని 2038 ఖాళీలను అగ్రికల్చర్ అభ్యర్థులతో భర్తీ చేయడానికి సీఎం అంగీకరించారు. ట్రాన్స్‌ఫార్మర్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, శాశ్వత పరిష్కారాలు అన్వేషించాలని సూచించారు. ఈ సమీక్షలో వ్యవసాయ సహాకర మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ప్రభుత్వ సలహాదారు(వ్యవసాయం) అంబటి కృష్ణారెడ్డి, ఏపీ స్టేట్ ఆగ్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బుక్కపట్నం నవీన్ నిశ్చల్, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య ఇతర అధికారులు పాల్గొన్నారు.

click me!