గతంలో గద్దించి... నేడు గండుపిల్లిలా మౌనమేల జగన్ రెడ్డి: అచ్చెన్న సెటైర్లు

By Arun Kumar PFirst Published Jun 11, 2021, 10:34 AM IST
Highlights

రాష్ట్ర ప్రజలు కష్టాల్లో ఉన్నపుడు పెట్రోల్, డీజిల్ పై అదనపు వ్యాట్ రద్దు చేసి ప్రజల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి లేదా? అని జగన్ ను నిలదీశారు అచ్చెన్నాయుడు. 

అమరావతి: జగన్ రెడ్డి పాలనలో రాష్ట్ర అభివృద్ధి నత్తలా కూడా నడవకపోగా... పెట్రోల్, డీజిల్ రేట్లు మాత్రం రాకెట్ స్పీడ్ లో దూసుకెళ్తున్నాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. వైసిపి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టే నాటికి రూ.75 ఉన్న పెట్రోల్ డీజిల్ ధరలు ఇప్పుడు సెంచరీ కొట్టి డబుల్ సెంచరీవైపు దూసుకెళ్తున్నాయని అన్నారు. అయినా మన తాడేపల్లి తాబేదారులో కనీసం స్పందన లేకపోవడం సిగ్గుచేటు అని అచ్చెన్న మండిపడ్డారు. 

''రాష్ట్ర ప్రజలు కష్టాల్లో ఉన్నపుడు అదనపు వ్యాట్ రద్దు చేసి ప్రజల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి లేదా? ప్రజలు ఇబ్బంది పడకూడదని కేరళ ప్రభుత్వం లీటర్ పెట్రోల్ పై ఏకంగా రూ.6 వరకు భారాన్ని తగ్గించింది. గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నపుడు రాష్ట్ర ఆదాయం కంటే ప్రజల బాగోగులే ముఖ్యంగా వ్యాట్ రెండు రూపాయలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు'' అని తెలిపారు. 

''గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ రెడ్డి నానా రాద్దాంతం చేసి.. అధికారంలోకి వచ్చీరాగానే రెండు సార్లు వ్యాట్ పెంచారు. పెట్రోల్ పై 32% ఉన్న వ్యాట్ ను 35%కి పెంచారు. అదనపు సెస్ పేరుతో రూ.4, రోడ్డు సెస్ పేరుతో మరో రూపాయి అదనంగా బాదుతున్నారు. ప్రజలు ఏమైపోయినా నాకు అనవసరం.. ఖజానా నింపుకోవడమే ముఖ్యం అనేలా వ్యవహరిస్తూ.. తుగ్లక్ ముఖ్యమంత్రిగా నిరూపించుకున్నారు'' అని విమర్శించారు.

read more  గ్రూప్ 1 పై ఏ1 రెడ్డి కన్ను... ఏపీపీఎస్సీని వైసిపిపీఎస్సీగా మార్చి అక్రమాలు..: లోకేష్ ఫైర్

''పక్కనున్న తెలంగాణతో పాటు తమిళనాడు, ఒడిశా, కర్నాటక వంటి రాష్ట్రాలన్నింటి కంటే ఏపీలోనే ధరలు ఎక్కువగా ఉన్న మాట వాస్తవం కాదా.? నేను ఉన్నాను.. విన్నాను అంటూ ప్రసంగాలు దంచికొట్టిన వ్యక్తి ధరలు తగ్గించడం మాట అటుంచి అదనపు పన్నులతో ప్రజల నడ్డి విరుస్తున్నారు'' అన్నారు. 

''పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల భారం ప్రజారవాణా వ్యవస్థపై తీవ్రంగా పడుతోంది. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. చివరికి వ్యవసాయం కూడా భారమవుతోంది. ప్రజలు పొట్టకూటి కోసం నానా అవస్థలు పడుతుంటే తాడేపల్లి రాజప్రాసాదంలో దరిద్రపు రాజకీయాలు చేయడం సిగ్గుచేటు. ప్రజలు కష్టాలు పడుతుంటే.. ప్యాలస్ లో కుంభకర్ణుడి నిద్ర పోతున్న నీకు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత ఉందా.? ఇప్పటికైనా ప్రజల సమస్యలపై కనీసం స్పందించు. పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలను నియంత్రించు'' అని అచ్చెన్నాయుడు కోరారు. 
 
 
 

click me!