ప్రపంచ కప్ 2023 మెగా టోర్నీలో టీమిండియా ఓటమిని తట్టుకోలేేక తెలుగు టెకీ గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది.
తిరుపతి : స్వదేశంలో జరిగిన ప్రపంచకప్ 2023 టోర్నీలో చివరమ్యాచ్ వరకు టీమిండియా జైత్రయాత్ర కొనసాగింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్... ఇలా అన్నివిభాగాల్లో అద్భుతాలు చేస్తూ ఓటమన్నదే లేకుండా ఫైనల్ కు చేరడంతో ఇక కప్ భారత్ దే అని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. కానీ వందకోట్ల భారతీయుల ఆశలను అడియాశలు చేస్తూ ఫైనల్లో ఆస్ట్రేలియా విజయం సాధించి ట్రోఫీని ఎగరేసుకు పోయింది. ఇలా టీమిండియా ఓడిపోవడం తట్టుకోలేకపోయిన ఓ వీరాభిమాని ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఆంధ్ర ప్రదేశ్ లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... తిరుపతి జిల్లా దుర్గసముద్రం గ్రామానికి చెందిన జ్యోతికుమార్ యాదవ్(32) సాప్ట్ వేర్ ఇంజనీర్. అతడికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. దీంతో మన దేశంలోనే జరిగిన ప్రపంచ కప్ టోర్నీని మొదటినుండి ఫాలో అయ్యాడు. టీమిండియా విజయం సాధించిన ప్రతిసారీ పొంగిపోయేవాడు. ఇలా గత ఆదివారం జరిగిన ఫైనల్ కు ముందువరకు అతడు ఎంతో ఆనందంగా వున్నాడు.
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో వరల్డ్ కప్ విజేతను నిర్ణయించే కీలకమ్యాచ్ లో టీమిండియా తడబడటం జ్యోతికుమార్ తట్టుకోలేకపోయాడు. ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోవడంతో తీవ్ర డిప్రెషన్ కు గురయ్యాడు. తన అభిమాన ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కన్నీరు పెట్టుకుంటూ మైదానాన్ని వీడటాన్ని చూసి జ్యోతికుమార్ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యాడు. దీంతో టీవి ముందే గుండెపోటుకు గురయి కుప్పకూలిపోయాడు.
Read More Shubman Gill : శుభ్‌మన్ గిల్ భావోద్వేగ ట్వీట్ .. నెట్టింట వైరల్..
వెంటనే జ్యోతికుమార్ కుటుంబసభ్యులు అతడిని తిరుపతి రుయా హాస్పిటల్ కు తరలించారు. కానీ హాస్పిటల్ కు చేరేలోపే అతడు మృతిచెందాడు. దీంతో ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాదం నిండిపోయింది. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.