
ఏపీలో ఖాళీ అయిన రాజ్యసభ సీటుకోసం తమిళనాడుకు చెందిన అన్నామలై, ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ పేర్లు గట్టిగా వినిపించాయి. అయితే.. చివరకు సత్యనారాయణకు అవకాశం దక్కింది. ఆయన రేపు నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు. విదేశీ పర్యటనలో ఉన్న ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరితో సోమవారం సాయంత్రం బీజేపీ అధిష్టానం పెద్దలు చర్చించి.. సత్యనారాయణను ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించారు. ఈమేరకు బీజేపీ అధికారికంగా నోట్‌ను విడుదల చేసింది.
సంఘ్ నుంచి రాజ్యసభ వరకు..
గోదావరి జిల్లాకు చెందిన బీజేపీ నాయకుడు పాక వెంకట సత్యనారాయణ తొలి నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌లో చాలా యాక్టివ్‌గా ఉండేవారు. సంఘ కార్యకలాపాలు చూస్తూ.. సర్వీస్ చేసేవారంట. ఆ తర్వాత బీజేపీలో చేరి.. అటు రాజకీయాలు.. ఇటు సంఘ కోసం పనిచేస్తూ వస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌లో క్రియాశీలకంగా పనిచేసిన సత్యనారాయణను బీజేపి ఎంపిక చేయడం గమనార్హం. ఇక సత్యనారాయణ రెండేళ్లపాటు రాజ్యసభ ఎంపీగా కొనసాగనున్నారు. ఇప్పటికే ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల అయింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ గడువు ముగియనుంది. ఏప్రిల్ 30న నామినేషన్ల పరిశీలించి, మే 2 వరకు ఉపసంహరణకు గడువు ఇచ్చారు. మే 9న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మే 13న అధికారికంగా ఎంపికైన అభ్యర్థిని ప్రకటిస్తారు.