
ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) వివిధ కారణాలతో ఎన్నికలు జరగని నెల్లూరు కార్పొరేషన్ (Nellore corporation), 12 మున్సిపాలిటీలకు నేడు పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కుప్పం, ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, దాచేపల్లి, గురజాల, దర్శి, బుచ్చిరెడ్డి పాలెం, బేతంచర్ల, కమలాపురం, రాజంపేట, పెనుగొండ మున్సిపాలిటీలకు పోలింగ్ (Polling) జరుగుతుంది. అంతేకాకుండా గ్రేటర్ విశాఖలో రెండు డివిజన్ స్థానాలకు, విజయనగరం, కాకినాడ, ఏలూరు, మచిలీపట్నం, గుంటూరు, అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌ల పరిధిలోని 10 డివిజన్‌ల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో పలు మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న వార్డులకు నేడు పోలింగ్ జరుగుతుంది. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద అధికారులు శానిటైజర్లు ఏర్పాటు చేశారు.
ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం మున్సిపాలిటీకి కూడా నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. కుప్పం మున్సిపాలిటీలో 24 వార్డులకు పోలింగ్ జరగనుంది. గత కొంతకాలంగా ఎన్నికల్లో టీడీపీ వరసు అపజయాలు చవిచూస్తున్న వేళ.. ఇప్పుడు అందరి దృష్టి కుప్పం వైపే ఉంది. కుప్పం మున్సిపాలిటీ ఎన్నికను అధికార ప్రతిపక్ష పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అక్కడ గత కొద్ది రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోవడంతో భారీగా పోలీసులను మోహరించారు.
Also read: AP Local body Elections : కర్నూలులో వైసీపీకి షాక్.. అధికారంలో ఉన్న స్థానాల్లో ఓటమి...
మరోవైపు టీడీపీ మాత్రం అధికార పార్టీ తమ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తుంది. కుప్పంలో దొంగ ఓట్లు వేయించేందుకు వైసీపీ కుట్ర చేస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ కార్యకర్తలనే పోలీసులు టార్గెట్ చేసకుంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. ఈ క్రమంలోనే కుప్పం నేతలతో సోమవారం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించరారు. జాగ్రత్తగా పని చేయాలని ఆదేశించారు. ఎన్నికల్లో అక్రమాలను అడ్డుకోవాలని, ఆధారాలు సేకరించి వీడియోలు బయటపెట్టాలని పిలిపునిచ్చారు. అంతేకాకుండా అక్కడ ఎన్నికల సరళిని పర్యవేక్షించడానికి మరికాసేపట్లో చంద్రబాబు కుప్పం బయలుదేరి వెళ్లనున్నారు.