జగన్ పై ఎగతాళి: ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ కు ఉద్వాసన, గదికి తాళం

By telugu teamFirst Published Jun 25, 2019, 1:50 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌ మేగజైన్‌ జూన్‌ ఎడిషన్‌ కొత్త ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డిని అవహేళన చేసేలా ఉందని, కనీసం జగన్‌ను సీఎంగా గుర్తించేందుకు కూడా ఈ మేగజైన్‌ బృందం ఇష్టపడినట్టు కనిపించలేదని అంటున్నారు. 

అమరావతి: ప్రభుత్వ అధికారిక పత్రిక ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ఎడిట‌ర్‌ కందుల రమేష్ ను కార్యాలయం బయటకు పంపించేసి, కార్యాలయానికి తాళం వేసినట్లు తెలుస్తోంది. ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మాన్ని త‌ప్పుగా ప్ర‌చురించ‌డ‌మే కాకుండా ఎగ‌తాళి చేశారని కందుల రమేష్ పై ఆరోపణలు వచ్చాయి.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ఆంధ్రప్రదేశ్‌ పేరుతో మేగజైన్‌ను ప్రభుత్వం నడిపిస్తోంది. ఈ మేగజైన్‌ జూన్‌ ఎడిషన్‌ కొత్త ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డిని అవహేళన చేసేలా ఉందని, కనీసం జగన్‌ను సీఎంగా గుర్తించేందుకు కూడా ఈ మేగజైన్‌ బృందం ఇష్టపడినట్టు కనిపించలేదని అంటున్నారు. 

ముఖ్యమంత్రిని అవహేళన చేసేలా ఉండడంతో పాటు తప్పుడు వ్యాఖ్యలతో మేగజైన్‌ను ముద్రించారని, దీంతో జూన్ ఎడిషన్‌ను బయటకు రాకుండా నిలిపివేశారని తెలుస్తోంది.

చంద్రబాబు హయాంలో లోకేష్  సిఫార్సుతో భారీ జీతంతో ఎడిట‌ర్‌గా కందుల ర‌మేష్ చేరారని చెబుతున్నారు. ఆనాటి నుంచి ఇంగ్లీష్‌, తెలుగు ఎడిష‌న్ల‌ను ఆయన పర్యవేక్షిస్తున్నారు. అయితే ప్ర‌భుత్వం మారిన త‌ర్వాత కూడా జాగ్ర‌త్త‌గా ఉండ‌కుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అవహేళన చేసే విధంగా పత్రికను తెచ్చారని కందుల రమేష్ ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. 

 సాధారణంగా ఆంధ్రప్రదేశ్ మాగ‌జైన్‌ను కలర్లో ముద్రిస్తున్నారు. కానీ జగన్ సీఎం అయిన వెంటనే వెలువడిన తొలి ఎడిషన్‌ను బ్లాక్‌ అండ్ వైట్‌లో ముద్రించారు. జగన్‌ ప్రమాణస్వీకార ఫొటోను నలుపు రంగులో అచ్చేశారు. జగన్‌ అనే నేను అని సీఎం ప్రమాణస్వీకారం చేస్తే మేగజైన్‌లో హెడ్‌లైన్‌ను ‘జగన్‌ అనే అతడు’ అని పెట్టడం ద్వారా ఎడిటోరియల్ టీం తమలోని అసహనాన్ని ప్రదర్శించిందని అంటున్నారు.

ప్రమాణస్వీకారం సందర్భంగా భావోద్వేగానికి లోనైన వైఎస్ విజయమ్మ జగన్‌ను హత్తుకుని కంటతడిపెట్టిన విషయం తెలిసిందే. ఆ ఫోటోను ముద్రించిన పత్రికా నిర్వాహకులు జగన్‌ ఏడ్చినట్టు రాశారు. ఈ మేగజైన్‌ను చూసి జగన్‌ దిగ్భ్రాంతికి గురైనట్టు చెబుతున్నారు. ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారంపై ఇలా తప్పుగా రాతలు రాయడంపై సీఎంవో తీవ్ర ఆగ్రహం, తన అసంతృప్తిని తెలియజేసింది. 

రాజీనామా చేయడానికి కందుల రమేష్ కు సిఎంవో ఒక రోజు సమయం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఆయన రాజీనామా చేయలేదు. దాంతో కందుల ర‌మేష్ గ‌దికి తాళం వేసి బ‌య‌ట‌కు పంపించి వేసినట్లు తెలుస్తోంది.

click me!