తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు భారీ ఊరట: మూడు కేసుల్లో ముందస్తు బెయిల్

By narsimha lodeFirst Published Jan 10, 2024, 2:41 PM IST
Highlights

తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో  ఊరట దక్కింది.

అమరావతి: తెలుగు దేశం పార్టీ  అధినేత నారా చంద్రబాబు నాయుడుకు  ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో  బుధవారంనాడు ఊరట లభించింది.  మద్యం , అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు , ఉచిత ఇసుక కేసుల్లో  చంద్రబాబుకు  ముందస్తు బెయిల్  మంజూరు చేసింది ఆంద్రప్రదేశ్ హైకోర్టు.

అమరావతి ఇన్నర్ రింగ్  అలైన్ మెంట్ లో అక్రమాలు,  మద్యం కంపెనీల అనుమతిలో అక్రమాలకు పాల్పడ్డారని , ఉచిత ఇసుకలో అక్రమాలకు పాల్పడ్డారని  ఆంద్రప్రదేశ్ సీఐడీ చంద్రబాబుపై కేసులు నమోదు చేసింది.ఈ కేసుల్లో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు.ఈ పిటిషన్లపై విచారణ నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. 
దర్యాప్తునకు  పిటిషనర్ సహకరించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది.ఈ కేసులకు సంబంధించి ఎక్కడా కూడ మాట్లాడవద్దని  కూడ  ఏపీ హైకోర్టు  కోరింది. 

 అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు మాస్టర్ ప్లాన్  లో అవకతవకలు జరిగాయని  ఏపీ సీఐడీ చంద్రబాబుపై కేసు నమోదు చేసింది.  ఈ కేసుపై  ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు  ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.ఉద్దేశ్యపూర్వకంగానే కేసు నమోదు చేశారని  చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదించారు.  రింగ్ రోడ్డు వేయకుండానే ఎలా అవకతవకలు  జరిగాయని ఎలా చెబుతారని వారు  పేర్కొన్నారు.  అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకు సమీపంలోనే  చంద్రబాబుకు చెందిన సన్నిహితులు, బంధువులు , తెలుగు దేశం పార్టీ నేతలు భూములు కొనుగోలు చేశారని సీఐడీ ఆరోపణలు చేసింది.  ఈ ఆరోపణలను చంద్రబాబు తరపు న్యాయవాదులు తోసిపుచ్చారు.

మద్యం కంపెనీలకు అనుమతులు  జారీ చేసే విషయంలో కొన్ని  కంపెనీలకు  అనుకూలంగా అనుమతులిచ్చారని  చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై  కూడ  కేసు నమోదు చేసింది సీఐడీ. కోర్టులో సీఐడీ వాదనలను  చంద్రబాబు తరపు న్యాయవాదులు కొట్టి పారేశారు. మద్యం కంపెనీలకు  ప్రయోజనం చేసేలా  నిబంధనలు రూపొందించారని చెప్పేందుకు  ఆధారాలు లేవని కూడ  చంద్రబాబు తరపు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. 

మరో వైపు ఉచిత ఇసుక పధకంపై   ప్రభుత్వానికి నష్టం వచ్చేలా  చంద్రబాబు సర్కార్ వ్యవహరించిందని సీఐడీ  కేసు నమోదు చేసింది. అయితే  ఈ విషయమై సీఐడీ వాదనలను కౌంటర్ చేస్తూ  చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. 

రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై  ప్రశ్నిస్తున్నందున  చంద్రబాబుపై  ప్రభుత్వం అక్రమంగా కేసులు బనాయిస్తుందని  పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదించారు. సీఐడీ విచారణకు  పిటిషనర్ సహకరిస్తారని  కూడ కోర్టుకు తెలిపింది. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత తీర్పులను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజర్వ్ చేసింది.  ఈ కేసులపై ఇవాళ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును వెల్లడించింది. మూడు  కేసుల్లో చంద్రబాబుకు  ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది. 

click me!