పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అధ్యక్షతన పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో వైద్య, హోం, కుటుంబ సంక్షేమ శాఖల సమన్వయంతో గురువారం ఉన్నత స్థాయి సమీక్ష జరగనుంది.
అమరావతి: కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ... ఆక్సిజన్ అవసరం పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అధ్యక్షతన పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో వైద్య, హోం, కుటుంబ సంక్షేమ శాఖల సమన్వయంతో గురువారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.
ప్రజల ప్రాణాలను కాపాడుకోవడమే ప్రాధాన్యతగా రాష్ట్రంలోని ఆక్సిజన్ ఆధారిత పరిశ్రమలకు ప్రత్యామ్నాయం చూపే దిశగా ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అవసరమైతే ఆక్సిజన్ ఆధారిత గ్రామీణ సూక్ష్మ పరిశ్రమల ద్వారా ఉపాధి పొందుతున్న వారిని ఆదుకోవడానికి గల అవకాశాలపై నిర్ణయం తీసుకోనున్నారు మంత్రి మేకపాటి.
undefined
తప్పని పరిస్థితులలో అవసరమయితే పరిశ్రమలకు ఇతర ప్రాంతాల నుంచి ఆక్సిజన్ దిగుమతి చేసుకునే వెసులుబాటు కల్పించే అవకాశాలపై పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి సంబంధిత శాఖ కార్యదర్శులతో చర్చించనున్నారు. ఆక్సిజన్ ఆధారిత పరిశ్రమలకు సరఫరా చేసే ప్రాణవాయువును ఆసుపత్రులకు వచ్చే విధంగా పరిశ్రమల శాఖకు మార్గనిర్దేశం చేయనున్నారు.
read more ఆక్సిజన్ డిమాండ్ పీక్స్‌కు చేరేతే: ఏపీ యాక్షన్ ప్లాన్ ఇదే..!!
ప్రాణవాయువు కొరతతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో ఈ నెల 18న కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. నేటి (22వతేదీ) నుంచి ఫార్మా పరిశ్రమలు, పెట్రోలియమ్ రిఫైనరీలు, ఉక్కు కర్మాగారాలు, ఆక్సిజన్ సిలిండర్ల తయారీ, న్యూక్లియర్ ఎనర్జీ ఫెసిలిటీస్, ఆహార, నీటి శుద్ధి, వ్యర్థపు నీటిని మంచినీరుగా మార్చే ప్లాంట్లు, ఇంజక్షన్, సీసాల వంటి తయారీ పరిశ్రమలకు ఆక్సిజన్ సరఫరా నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలను ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆయా పరిశ్రమలకు ప్రత్యామ్నాయ మార్గాలు సహా కీలక విషయాలపై సమగ్రంగా చర్చించనున్నారు మంత్రి గౌతమ్ రెడ్డి.
కరోనా కేసులు రోజురోజుకు పెరగడం, మరణాల సంఖ్య కూడా పెరుగుతున్న నేపథ్యంలో మెడికల్ ఆక్సిజన్ కు డిమాండ్ ను పరిగణలోకి తీసుకుని ఆసుపత్రులకు సరఫరా చేయడమే ప్రథమ ప్రాధాన్యతగా భావించి ప్రజల ప్రాణాలను రక్షించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలను చేయడానికి సమాయత్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన తొమ్మిది రకాల ఆక్సిజన్ పరిశ్రమలు కాకుండా ఏవైనా ఇతర ఆక్సిజన్ పరిశ్రమలు ఉన్నట్లయితే వాటికి స్వతహాగా ఎయిర్ సెపరేటర్ యూనిట్ల(ఏఎస్ యూ) ఏర్పాటు చేసుకునేందుకు లేదా ఆక్సిజన్ ను ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునే అవకాశం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను ఇవ్వనుంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఆక్సిజన్ వినియోగంతో నడిచే పరిశ్రమలపై జిల్లా పరిశ్రమల శాఖ అధికారుల ఆధ్వర్యంలో పర్యవేక్షణకు సంబంధించిన పటిష్టమైన చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ సహా వైద్య, కుటుంబ సంక్షేమ, హోమ్ శాఖలతో పాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.