Andhra pradesh: రాజ‌కీయాల్లో విషాదం.. ఏపీ మాజీ డిప్యూటీ సీఎం క‌న్నుమూత

Published : Sep 15, 2026, 03:32 PM IST
Andhra pradesh

సారాంశం

Andhra pradesh: ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (ఆళ్ల నాని) హఠాన్మరణం చెందారు. మంగళవారం (సెప్టెంబర్‌ 15) విశాఖపట్నంలోని తన నివాసంలో గుండెపోటుకు గురైన ఆయన తుదిశ్వాస విడిచారు.

ఏలూరు నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా..

ఆళ్ల నాని రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్‌ పార్టీతో ప్రారంభమైంది. 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఏలూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి వరుస విజయాలు సాధించారు. ఆ తర్వాత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఆయన.. 2019 ఎన్నికల్లో మరోసారి ఏలూరు నుంచి గెలుపొందారు. దీంతో ఏలూరు రాజకీయాల్లో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేతగా ప్రత్యేక గుర్తింపు పొందారు.

జగన్‌ కేబినెట్‌లో డిప్యూటీ సీఎం, వైద్యారోగ్య శాఖ మంత్రి

2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆళ్ల నానికి కీలక బాధ్యతలు దక్కాయి. వైఎస్‌ జగన్‌ మంత్రివర్గంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. అదే సమయంలో ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా నిర్వహించారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖకు సంబంధించిన అంశాల్లో ఆయన కీలకంగా వ్యవహరించారు. ఏలూరు రాజకీయాల్లోనే కాకుండా రాష్ట్ర స్థాయిలోనూ ఆయనకు ప్రత్యేక గుర్తింపు లభించింది.

2024 తర్వాత టీడీపీలో చేరిక

2024 అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఆళ్ల నాని వైఎస్సార్‌సీపీకి వీడ్కోలు పలికి 2025లో తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన పార్టీలోకి వచ్చారు. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవంతో రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న ఆళ్ల నాని ఆకస్మిక మరణం రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

జగన్‌, చంద్రబాబు సంతాపం

ఆళ్ల నాని మృతిపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాని ఆకస్మిక మరణం తనను కలచివేసిందని పేర్కొంటూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులకు ధైర్యం కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఆళ్ల నాని మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మాజీ ఉప ముఖ్యమంత్రి కాళీ కృష్ణ శ్రీనివాస్‌ హఠాన్మరణం తనకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. చిన్న వయసులోనే గుండెపోటుతో ఆయన దూరం కావడం బాధాకరం అని పేర్కొన్నారు. ఆళ్ల నాని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన చంద్రబాబు.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.

ఆళ్ల నాని ప్ర‌స్థానం..

1969 డిసెంబర్‌ 30న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జన్మించిన ఆళ్ల నానికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. 1994లో కాంగ్రెస్‌ పార్టీతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి అదే ఏడాది, 1999 ఎన్నికల్లో ఓటమిపాలైన ఆయన.. 2004లో టీడీపీ అభ్యర్థి అంబికా కృష్ణపై విజయం సాధించి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

2004 నుంచి 2013 వరకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా కొనసాగిన నాని.. 2013లో పదవికి రాజీనామా చేసి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయినా 2017లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2019లో ఏలూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా గెలిచి వైఎస్‌ జగన్‌ కేబినెట్‌లో ఉప ముఖ్యమంత్రిగా, వైద్యారోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2024 ఎన్నికల్లో ఓటమి అనంతరం అదే ఏడాది ఆగస్టు 17న వైసీపీకి రాజీనామా చేసిన ఆయన.. 2025 ఫిబ్రవరి 13న టీడీపీలో చేరారు. ఆళ్ల నాని మృతితో ఏలూరు జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Government Jobs : తెలుగు యువతకు ఇదే కరెక్ట్ టైమ్.. గట్టిగా ట్రై చేస్తే డిప్యూటీ కలెక్టర్లు, డిఎస్పిలు అయిపోవచ్చు
Heavy Rain Alert: ద్రోణి ప్రభావంతో పిడుగులు, ఈదురుగాలులతో భారీ వర్షాలు.. ఏపీ, తెలంగాణకు ఐఎండీ అలర్ట్