
Andhra Pradesh Earthquake : ఆంధ్ర ప్రదేశ్ లో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ ప్రకటించింది. రిక్టర్ స్కేలుపై 3.7 తీవ్రతతో భూకంపం సంభవించిందని వెల్లడించింది. ఈ భూకంప కేంద్రం భూమిలో 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు సిస్మాలజీ సెంటర్ ప్రకటించింది.
ఈ భూకంపం ప్రభావం విశాఖపట్నంలో స్పష్టంగా ఉంది... ఈ తెల్లవారుజామున 4 గంటల 19 నిమిషాల సమయంలో భూమి కంపించింది. గాజువాక, మధురవాడ, రిషికొండ, మహారాణిపేట, అక్కయ్యపాలెం, కైలాసపురం ప్రాంతాల్లో భూమి కంపించినట్లుగా వార్తలు వెలువడుతున్నాయి. ఇంకా ప్రజలు నిద్రలో ఉండగానే భూమి కంపించింది... దీంతో భయాందోళనకు గురయినవారు నిద్రలేచి ఇంటిబయటకు పరుగు తీశారు. భూకంప తీవ్రత తక్కువగా ఉండటంతో ప్రమాదం తప్పింది.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో సంభవించిన భూకంపం ఏపీలోని మరికొన్ని జిల్లాలతో పాటు తెలంగాణకు విస్తరించింది... అంటే దీని ప్రభావం ఈ ప్రాంతాలపై ఉంది. ఇలా 296 కి.మీ గుంటూరు, 315 కి.మీ వరంగల్, 367 కిమీ నల్గొండ, 367 కిమీ కరీంనగర్, 274 కిమీ బెర్హమ్ పూర్ (ఒడిషా) వరకు భూకంప ప్రభావం ఉందని నేషనల్ సెస్మాలజీ సెంటర్ వెల్లడించింది.
అయితే ఈ భూకంపం ప్రభావంతో ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం సంభవించినట్లు ఇప్పటివరకు సమాచారం లేదు. విశాఖపట్నం ప్రాంతంలో ప్రజలు భయాందోళన గురయ్యారు.