
అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెల 4వ తేదీని ఢిల్లీకి వెళ్లనున్నారు. మరుసటి రోజు ఉదయం ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అవుతారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులతో ఆయన సమావేశమయ్యే అవకాశం ఉన్నది. ప్రతి నెలాఖరులో సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లడం ఆనవాయితీగా మారిందని కొందరు విమర్శకులు ఇప్పటికే అంటున్నారు. గత నెలాఖరులోనూ వెళ్లాలని అనుకున్నారని, కానీ, సాధ్యం కాలేదని చెబుతున్నారు.
వివేకా హత్య కేసులో సీబీఐ తాజా చార్జిషీటు, జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ సీబీఐ కోర్టులో మళ్లీ ప్రారంభం కావడం నేపథ్యంలో ఆయన ఢిల్లీ పర్యటిస్తున్నారు.
ఇదంతా ఒక వైపు ఉండగా.. ఆయన ముందస్తు ఎన్నికల కోసం ఢిల్లీ పెద్దలతో మంతనాలు జరపడానికే వెళ్లుతున్నారని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఏపీలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని ప్రతిపక్షాలు పలుమార్లు పేర్కొన్న సంగతి తెలిసిందే. అంతేకాదు, ఇటు టీడీపీ, అటు జనసేన ఉధృతంగా ప్రచారం చేస్తున్నాయి.
ఈ సారి ముందస్తుగా ఎన్నికలకు వెళ్లాలని, ఈ ఎన్నికలకు తెరచాటున కేంద్రంలోని పెద్దల సహకారం తీసుకోవాలనే ఆలోచనలతోనే సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లారన్నది రాజకీయ వర్గాలు చెబుతున్నమాట. అంతేకాదు, విపక్షాలను కట్టడి చేయడానికి రాష్ట్రంలో ఒకేసారి ఎన్నికలను నిర్వహించకుండా.. పలు దశల్లో విభజించి ఎన్నికలు నిర్వహించేలా చూడాలని విజ్ఞప్తి చేసే అవకాశాలున్నాయని వివరిస్తున్నాయి.