ఎవరీ శ్రీనివాసవర్మ..? పురంధేశ్వరి, సీఎం రమేష్ కంటే తోపా..!! 

By Arun Kumar P  |  First Published Jun 10, 2024, 8:46 AM IST

విద్యార్థి నాయకుడిగా ప్రారంభమైన భూపతిరాజు శ్రీనివాసవర్మ పొలిటికల్ కెరీర్ కేంద్ర మంత్రి స్థాయికి చేరుకుంది. రాజకీయ ఉద్దండులు పురంధేశ్వరి, సీఎం రమేష్ వంటివారిని సైతం వెనక్కినెట్టి మోదీ కేబినెట్ చోటు దక్కించుకున్నారు... ఇంతకూ ఎవరీ శ్రీనివాసవర్మ? 


అమరావతి :కేంద్రంలో ఎన్డిఏ ప్రభుత్వం ఏర్పాటయ్యింది. నరేంద్ర మోదీ హ్యాట్రిక్ కొట్టేసారు...  ముచ్చటగా మూడోసారి ఆయన భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. కేంద్ర మంత్రివర్గం కొనసాగిన ఊహాగానాలకు కూడా తెరపడింది. 72 మంది మంత్రులతో మోదీ 3.O టీమ్ రెడీ అయ్యింది... ప్రధానితో పాటు కేంద్ర మంత్రులతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయించారు. అయితే కేంద్ర మంత్రివర్గంలో ఆంధ్ర ప్రదేశ్ నుండి ముగ్గురుకి చోటుదక్కింది. అందులో టిడిపి నుండి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ వున్నారు... ఇక బిజెపి నుండి అనూహ్యంగా నరసాపురం ఎంపీ భూపతిరాజు  శ్రీనివాసవర్మకు చోటు దక్కింది. 

ప్రమాణస్వీకారానికి ముందువరకు అసలు శ్రీనివాసవర్మ ఎవరో కూడా చాలామందికి తెలియదు. ఏపీలో ముగ్గురు బిజెపి ఎంపీలు గెలిచారని... అందులో ఒకరు శ్రీనివాసవర్మ అని మాత్రమే తెలుసు. కానీ మోదీ కేబినెట్ లో  చోటు దక్కించుకోవడంతో ఇంతకూ ఎవరీ శ్రీనివాసవర్మ? రాజకీయ పలుకుబడి కలిగిన పురంధేశ్వరి, సీఎం రమేష్ ల కంటే తోపా..? అనే చర్చ ప్రజల్లో మొదలయ్యింది. దీంతో శ్రీనివాసవర్మ గురించి తెలుసుకునేందుకు ఏపీ ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. 

Latest Videos

ఎవరీ భూపతిరాజు శ్రీనివాసవర్మ..?  

ఆంధ్ర ప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కేంద్రం భీమవరం భూపతిరాజు శ్రీనివాసవర్మ స్వస్థలం. 1967 ఆగస్ట్ 4న సూర్యనారాయణరాజు-సీత దంపతులకు ఈయన జన్మించారు. ప్రస్తుతం భార్య వెంకటేశ్వరి దేవితో కలిసి జీవిస్తున్నారు. శ్రీనివాసవర్మ దంపతులకు సంతానం లేదు. 

శ్రీనివాసవర్మ విద్యాబ్యాసం అంతా స్థానికంగానే సాగింది...  ఆంధ్రా యూనివర్సిటీ నుండి ఎంఏ పూర్తిచేసారు. విద్యార్థి దశనుండే రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్న వర్మ 1980లో వామపక్ష విద్యార్థి సంఘం (ఏఐఎస్ఎఫ్) నాయకుడిగా ఎదిగారు. విద్యార్థుల సమస్యలపై పోరాటం చేస్తూ మంచి నాయకుడిగా గుర్తింపు పొందాడు.    

అయితే హిందుత్వ భావాలు కలిగిన వర్మ వామపక్ష పార్టీలో ఇమడలేకపోయారు. దీంతో బిజెపిలో చేరారు... ఈ పార్టీ ఆయనకు సరిగ్గా సరిపోయింది. దీంతో గత 34ఏళ్లుగా ఇందులోనే కొనసాగుతున్నారు. సాధారణ విద్యార్థి నాయకుడి స్థాయి నుండి అంచలంచెలుగా ఎదిగి మొదట  భీమవరం పట్టణ బిజెపి అధ్యక్ష స్థాయికి చేరుకున్నారు. ఆ తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేసారు. ఆయన సేవలను గుర్తించిన బిజెపి 2009  లో  నరసాపురం లోక్ సభ సీటు కేటాయించింది. ఇలా మొదటిసారి ఎన్నికల్లో పోటీచేసిన ఆయన ఓటమిపాలయ్యారు. 

ఈ ఓటమి శ్రీనివాసవర్మలో మరింత కసిని పెచింది. అప్పుడే ఎలాగైనా నరసాపురం లోక్ సభపై పట్టు సాధించాలని... గెలిచి చూపించాలని నిర్ణయించుకున్నారు. ఓవైపు పార్టీకోసం పనిచేస్తూనే మరోవైపు వ్యక్తిగతంగా ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించారు... దీంతో తాజా ఎన్నికల్లో అనుకున్నది సాధించారు.  

అంతా అనూహ్యమే..:  

కేంద్ర మంత్రిగానే కాదు నరసాపురం ఎంపీ టికెట్ కూడా శ్రీనివాసవర్మకు అనూహ్యంగానే దక్కింది.  టిడిపి, జనసేన, బిజెపి పొత్తు కుదరడంతో మళ్ళీ ఈసారి నరసాపురం  లోక్ సభ బరిలో రఘురామ కృష్ణంరాజు నిలుస్తారని భావించారు. అటు బిజెపి, ఇటు టిడిపితో సన్నిహిత సంబంధాలు కలిగిన రఘురామ ఏదో ఒక పార్టీ నుండి టికెట్ తెచ్చుకుంటారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా నరసాపురం ఎంపీ సీటు పొత్తులో భాగంగా బిజెపికి దక్కింది... వెంటనే అభ్యర్థిగా  భూపతిరాజు శ్రీనివాసవర్మ పేరు ఖరారయ్యింది.  

టిడిపి, జనసేన, బిజెపి కూటమి అండతో పాటు శ్రీనివాసవర్మ వ్యక్తిగత ఇమేజ్ కూడా ఎన్నికల్లో బాగా పనిచేసింది. నరసాపురంలో బిజెపికి కొంత పట్టు వుండటం... గతంలో గోకరాజు గంగరాజు, కృష్ణంరాజు వంటివారు ఈ పార్టీ నుండి ఎంపీలుగా గెలిచారు. ఇలా పార్టీ బలం, కూటమి సపోర్ట్, తన ఇమేజ్ కలిసిరావడంతో వైసిపి అభ్యర్థి గూడూరి ఉమాబాలపై ఏకంగా 2,76,802 ఓట్ల భారి మెజారిటీతో శ్రీనివాసవర్మ గెలిచారు.  

ఎంపీగా గెలిచినా ఆయనకు మోదీ 3.O కేబినెట్ లో చోటు దక్కుతుందని ఎవరూ ఊహించలేదు. రాజకీయంగా మంచి పలుకుబడి వుండటమే కాదు గతంలో కేంద్రమంత్రిగా చేసిన అనుభవం, ప్రస్తుతం బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి పురంధేశ్వరికి కలిసి వస్తాయని... ఆమెకే కేంద్ర మంత్రి పదవి దక్కుతుందని అందరూ భావించారు. లేదంటే ప్రస్తుతం ఎన్డిఏలో కీలకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు సన్నిహితుడు,  బిజెపి నేత సీఎం రమేష్ కు కేంద్రమంత్రి పదవి దక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఎవరూ ఊహించని శ్రీనివాసవర్మకు కేంద్ర మంత్రి పదవి దక్కింది. 

అయితేే రాాజకీయాల్లో పురంధేశ్వరి, సీఎం రమేష్ లు సీనియర్ల కావచ్చు... బిజెపిలో మాత్రం శ్రీనివాసవర్మనే సీనియర్.  పార్టీ కోసం కష్టపడే సామాన్య నాయకులకు సైతం గుర్తింపు లభిస్తుందనే సంకేతం శ్రీనివాసవర్మను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా ఇచ్చింది బిజెపి. ఇలా తెలుగు రాష్ట్రాల నుండి మొత్తం ఐదుగురికి మోదీ కేబినెట్ లో చోటు దక్కింది.  


 

click me!