పదేళ్లు అవకాశం కోసం ఎదురు చూశారు. ఆ ఛాన్స్ రానే వచ్చింది. బరిలోకి దిగి.. ఘన విజయం సాధించారు. వన్ షాట్ టూ బర్డ్స్ అన్నట్లుగా తొలిసారి ఎంపీగా గెలవడమే కాకుండా కేంద్ర మంత్రి పదవిని దక్కించుకున్నారు. ఆయనే గుంటూరు పార్లమెంటు సభ్యులు పెమ్మసాని చంద్రశేఖర్...
పెమ్మసాని చంద్రశేఖర్. గుంటూరు పార్లమెంటు సభ్యుడు. కేంద్ర సహాయ మంత్రి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు మార్మోగిపోతోంది. 2024 ఎన్నికల ముందు కొద్దిమందికే తెలిసిన ఈ పేరు ప్రస్తుతం ప్రతినోటా వినిపిస్తోంది. తొలిసారి బరిలోకి దిగి ఎంపీగా భారీ మెజారిటీతో గెలవడమే కాకుండా... కేంద్ర కేబినెట్ పదవీ పొందడంతో దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. 18వ లోక్ సభలో సభ్యుడు కావడంతో పాటు మోదీ 3.0 కేబినెట్లో మంత్రిగానూ ప్రమాణ స్వీకారం చేశారు.
గుంటూరు ఎంపీగా ఎన్నికై.. కేంద్ర సహాయ మంత్రి ప్రమాణం చేసిన పెమ్మసాని చంద్రశేఖర్‌ది స్ఫూర్తివంతమైన ప్రయాణం. గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెం స్వస్థలం. తల్లిదండ్రులు సువర్చల, సాంబశివరాలు. సాంబశివరావు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ అనుచరుడు. బుర్రిపాలెం వారి స్వగ్రామం కాగా, వ్యాపారరీత్యా ప్రసుత పల్నాడు జిల్లా నరసరావుపేటలో స్థిరపడ్డారు.
తొలి నుంచి చదువుల్లో చురుగ్గా ఉండే చంద్రశేఖర్... ఇంటర్, ఎంసెట్‌లో స్టేట్ ర్యాంకర్. ఎంసెట్‌లో 27వ ర్యాంకు సాధించి... 1999లో ఎంబీబీఎస్ పూర్తిచేశారు. ఆ తర్వాత పీజీ చదివేందుకు అమెరికా వెళ్లారు. పెన్సిల్వేనియాలో ఇంటర్నల్ మెడిసన్‌లో డాక్టర్ ఆఫ్ మెడిసిన్‌లో 2005లో పీజీ పూర్తిచేశారు. మెడికల్ లైసెన్సింగ్ పరీక్ష పూర్తిచేసే సమయంలో అమెరికాలో ఉండటానికి, ట్రైనింగ్ ఫీజు చెల్లించడానికి కూడా ఇబ్బంది పడ్డారు. ఎలాగోలా కష్టపడి పీజీలో జనరల్ గైసింగర్ వైద్య కేంద్రంలో అత్యధిక మార్కులు సాధించారు. అక్కడే వైద్యుడిగా రాణిస్తూ.... అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ‘యు వరల్డ్’ అనే ఆన్‌లైన్ లెర్నింగ్ పోర్టల్ స్థాపించారు. ఈ పోర్టల్ ద్వారా మెడికల్, నర్సింగ్, అకౌంటింగ్, ఫైనాన్స్, లీగల్, ఫార్మసీ ఇలా అనేక రంగాల్లో పరీక్షలకు ఆన్‌లైన్‌లో మెటీరియల్ విక్రయిస్తారు. ఇదే ఆయన ప్రధాన వ్యాపారం కాగా... ఇటీవల ఎన్నికల్లో పొందుపరిచిన అఫిడవిట్ భారీగా ఆస్తులను చూపించారు. ఆ సమయంలో తెలుగు రాష్ట్రాల్లో రిచ్ ఎంపీ అంటూ వార్తల్లోకెక్కారు.
చంద్రశేఖర్ తండ్రి మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా పనిచేశారు. ఇలా టీడీపీతో పెమ్మసాని కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. 2014లో నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించారు చంద్రశేఖర్. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఆయన పేరు ఖరారైనప్పటికీ... వివిధ రాజకీయ పరిణామాల నేపథ్యంలో పోటీ విరమించుకున్నారు. అప్పడా స్థానం నుంచి టీడీపీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు పోటీచేశారు. ఆ తర్వాత 2019లోనూ పోటీ చేయాలని ప్రయత్నించినా టికెట్ దక్కలేదు.
2024 ఎన్నికల్లో గుంటూరు పార్లమెంటు నుంచి బరిలోకి దిగారు పెమ్మసాని చంద్రశేఖర్. 3లక్షల 44వేల 695 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థిపై భారీ విజయం సాధించారు. విదేశాల్లో పనిచేసిన అనుభవం, వ్యాపారాల్లో రాణించడం చూసిన చంద్రబాబు ఆయన్ను ప్రోత్సహించారు. విదేశాల నుంచి రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడం, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడంలో చంద్రశేఖర్ అనుభవం పనికొస్తుందని చంద్రబాబు సహా పార్టీ పెద్దలు సైతం భావించినట్లు తెలుస్తోంది.
చంద్రశేఖర్ భార్య శ్రీరత్న కూడా వైద్యురాలు. ఆమె కూడా మెడిసిన్ లో ఉన్నత విద్య చదివి పరిశోధనలు చేశారు. అయితే, ఎన్నికల నామినేషన్ అఫిడవిట్ పత్రంలో తమ ప్రధాన వృత్తి వ్యాపారంగా పేర్కొన్నారు.
కాగా, కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అయనో ట్వీట్ చేశారు. ‘‘కేంద్ర మంత్రివర్గ బాధ్యతను నాకు అప్పగించిన భారతదేశ ప్రజానీకానికి, ఎన్డీయే నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కేంద్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వర్తించడమే కాకుండా ప్రజలందరికీ సంక్షేమాన్ని చేకూర్చి దేశ ప్రగతి కోసం నిరంతరం కృషి చేస్తాను’’ అని పోస్టు చేశారు..
కేంద్ర మంత్రివర్గ బాధ్యతను నాకు అప్పగించిన భారతదేశ ప్రజానీకానికి, ఎన్డీయే నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
కేంద్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణశుద్ధితో నిర్వర్తించడమే కాకుండా ప్రజలందరికీ సంక్షేమాన్ని చేకూర్చి దేశ ప్రగతి కోసం నిరంతరం కృషి చేస్తాను.… pic.twitter.com/wsHBE0Oiaz