రాజీనామా ఆమోదంపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు.
విశాఖపట్టణం: మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదంలో రాజకీయ కుట్ర ఏముందని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నించారు.
గురువారంనాడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఓ తెలుగు న్యూస్ చానెల్ తో మాట్లాడారు.
గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ ఎప్పుడో లేఖ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
తాను మానవతా థృక్ఫథంతో ఈ విషయమై నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేసినట్టుగా చెప్పారు. స్పీకర్ గా తన పదవి కాలం పూర్తి కానున్నందున యాక్షన్ లోకి దిగాల్సి వచ్చిందన్నారు. ఈ విషయమై గంటా శ్రీనివాసరావు న్యాయ పోరాటం చేసుకోవచ్చని చెప్పారు. పార్టీలు మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వారంలోపు అంతా క్లియర్ చేస్తామని తెలిపారు.
also read:కొత్తగా పెళ్లైన మహిళ డ్యాన్స్: ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న వీడియో
రెండు రోజుల క్రితం తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించారు. ఈ విషయమై గంటా శ్రీనివాసరావు స్పందించారు. మూడేళ్ల క్రితం చేసిన రాజీనామాను ఇప్పుడు ఆమోదించారన్నారు. రాజీనామా ఆమోదించే సమయంలో కనీసం తనను సంప్రదించలేదని గంటా శ్రీనివాసరావు చెప్పారు. ఈ విషయమై న్యాయ పోరాటం చేస్తామని గంటా శ్రీనివాసరావు ప్రకటించారు.
విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.ఈ రాజీనామాపై రెండు రోజుల క్రితం స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదం విషయమై రాజకీయ కుట్ర ఉందని తెలుగు దేశం ఆరోపిస్తుంది.ఈ ఆరోపణలను తమ్మినేని సీతారం తోసిపుచ్చారు.
ఈ ఏడాది మార్చి మాసంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్య సభ సభ్యులు రిటైర్ కానున్నారు. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో వ్యూహంలో భాగంగానే రాజీనామాల ఆమోదం, పార్టీలు మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారని తెలుగు దేశం పార్టీ ఆరోపిస్తుంది. అయితే ఈ విషయమై అందిన ఫిర్యాదుల ఆధారంగా చర్యలు తీసుకొనే ప్రక్రియను ప్రారంభించినట్టుగా తమ్మినేని సీతారాం ప్రకటించారు.