తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే వరప్రసాద్ జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. వైసిపి టికెట్ నిరాకరించడంలో జనసేనలో చేరే ప్రయత్నాాలు చేస్తున్నారు వరప్రసాద్.
అమరావతి : ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు సన్నద్దం అవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా అధికార వైసిపి భారీగా సిట్టింగ్ లను పక్కనబెట్టి కొత్తవారికి అవకాశం ఇస్తుండటం ప్రకంపనలు సృష్టిస్తోంది. టికెట్ దక్కని నేతలు వైసిపిని వీడుతున్నారు... ఈ సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా మరో వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యే వైసిపిని వీడేందుకు సిద్దమైనట్లుగా కనిపిస్తోంది.
తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే వరప్రసాద్ జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. బుధవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకున్న వరప్రసాద్ దాదాపు 20 నిమిషాల పాటు పవన్ తో భేటీ అయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయినప్పటికి ఆయనను వైసిపి అధిష్టానం పక్కనబెట్టింది... ఈసారి గూడూరు టికెట్ మేరుగ మురళికి కేటాయించింది. దీంతో తీవ్ర అసహనానికి గురయిన వరప్రసాద్ వైసిపిని వీడేందుకు సిద్దమయ్యారు... ఈ క్రమంలో ఆయన జనసేనానితో భేటీకావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించింది.
అయితే వరప్రసాద్ అసెంబ్లీకి కాకుండా లోక్ సభకు పోటీచేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎంపీగా కూడా పనిచేసిన ఆయన ఈసారి తిరుపతి లోక్ సభ నుండి బరిలో దిగే ఆలోచనలో వున్నారట. ఇదే విషయాన్ని ఆయన పవన్ కల్యాణ్ కు తెలిపి ఎంపీ టికెట్ కోరినట్లు తెలుస్తోంది. దీనిపై హామీ ఇస్తే వెంటనే జనసేనలో చేరేందుకు సిద్దంగా వున్నట్లు వరప్రసాద్ జనసేనానికి తెలిపినట్లు తెలుస్తోంది.
Also Read నేనూ, షర్మిల వైసీపీలోనే వుండాల్సింది.. కానీ : కొణతాల రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు
అయితే టికెట్ విషయంలో వరప్రసాద్ కు పవన్ కల్యాణ్ నుండి ఎలాంటి హామీ లభించలేదట... పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్లు సమాచారం. తిరుపతికి చెందిన జనసేన నేతలతో వరప్రసాద్ ను పార్టీలో చేర్చుకోవడం, టికెట్ కేటాయింపు అంశాలపై పవన్ చర్చించనున్నారు. వారి అభిప్రాయం మేరకే ఆయనను పార్టీలో చేర్చుకోవాలో లేదో పవన్ నిర్ణయించనున్నారు.
ఇదిలావుంటే జనసేన పార్టీలోకి వలసలు భారీగా పెరిగాయి. అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపిలో ఇప్పటికే దాదాపు టికెట్లు కన్ఫర్మ్ కావడంతో ఆశావహుల చూపు జనసేన పార్టీపై పడింది. ఇప్పటికే వైసిపి ఎంపీ వల్లభనేని బాలశౌరి జనసేనలో చేరేందుకు సిద్దమయ్యారు. ఉత్తరాంధ్రకు చెందిన సినీయర్ నాయకులు కొణతాల రామకృష్ణ, సినీనటుడు పృథ్వి, డ్యాన్స్ మాస్టర్ జానీ పవన్ సమక్షంలో జనసేనలో చేరారు. తాజాగా ఎమ్మెల్యే వరప్రసాద్ పవన్ తో భేటీ అయ్యారు. ఇలా భారీ చేరికలు జనసేన పార్టీలో కొత్త జోష్ నింపుతున్నాయి.