గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎన్నికల ఫలితాలు 2024

Published : Mar 05, 2024, 04:07 PM ISTUpdated : Mar 05, 2024, 05:06 PM IST
గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎన్నికల ఫలితాలు 2024

సారాంశం

గుంటూరు : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లాకు ప్రత్యేక స్థానం వుంది. ప్రస్తుతం గుంటూరు ప్రాంతంలో ఏర్పాటుచేసిన రాజధాని అమరావతిని వైసిపి ప్రభుత్వం ఇతర ప్రాంతాలకు తరలించాలని నిర్ణయించింది. ఇలాంటి సమయంలో జరుగుతున్న ఎన్నికలు కావడంతో గుంటూరు ఓటర్ తీర్పు ఎలా వుండనుందో అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ క్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ రాజకీయాలపై ఓ లుక్కేద్దాం.       

గుంటూరు తూర్పు నియోజకవర్గం : 

గుంటూరు జిల్లా కేంద్రాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం 2008 లో రెండు నియోజకవర్గాలుగా విభజించారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో గుంటూరు పట్టణం, చుట్టుపక్కల ప్రాంతాలను కలుపుకుని రెండు నియోజకవర్గాల ఏర్పాటు జరిగింది. అందులో ఒకటి గుంటూరు తూర్పు కాగా మరోటి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొత్తం 2,29,830  ఓటర్లున్నట్లు 2019 అసెంబ్లీ ఎన్నికల వివరాలను బట్టి తెలుస్తోంది. 

ముస్లిం జనాభా ఎక్కువగా వుండటంతో వారే ఈ నియోజకవర్గ రాజకీయాలను శాసిస్తున్నారు. ఈ నియోజకవర్గ ఏర్పాటు తర్వాత ఇప్పటివరకు మూడుసార్లు ఎన్నికలు జరిగ్గా గెలిచిన ముగ్గురూ ముస్లి సామాజికవర్గానికి చెందినవారు. ఈసారి కూడా ముస్లిం అభ్యర్థులనే అటు వైసిపి, ఇటు టిడిపి-జనసేన కూటమి బరిలోకి దించుతున్నాయి. 

2009 నుండి 2019 వరకు గెలుపెవరిది : 

ఉమ్మడి ఆంధ్ర  ప్రదేశ్ లో దివంగత వైస్ రాజశేఖర్ రెడ్డి, విభజన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హవా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కొనసాగుతోంది. నియోజకవర్గ ఏర్పాటుతర్వాత జరిగిన 2009 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ సారథ్యంలోని కాంగ్రెస్ షేక్ మస్తాన్ వలిని బరిలోకి దింపింది. ఆయన ఆనాటి ప్రజారాజ్యం అభ్యర్థి షేక్ శౌకత్, టిడిపి అభ్యర్థి జియావుద్దిన్ పై భారీ మెజారిటీతో గెలిచారు. మొత్తం పోలయిన ఓట్లలో 38 శాతం అంటే 45,586 ఓట్లు సాధించిన మస్తాన్ వలీ గుంటూరు తూర్పు నియోజకవర్గ మొదటి ఎమ్మెల్యేగా చరిత్రలో నిలిచిపోయారు.  పిఆర్పి 36,574 (30శాతం) ఓట్లతో రెండో స్థానం, టిడిపి 29,926 (25శాతం) ఓట్లతో మూడో స్థానంలో నిలిచాయి. 2009 లో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో  1,18,574 ఓట్లు పోలయ్యాయి.. అంటే 64 శాతం పొలింగ్ నమోదయ్యిందన్నమాట. 

ఇక 2014 లో ప్రత్యేక పరిస్థితుల్లో ఎన్నికలు జరిగాయి. ఉమ్మడి రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయినా వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్ హవా ఈ నియోజకవర్గంలో కనిపించింది. రాష్ట్రవ్యాప్తంగా టిడిపి హవా కొనసాగినా ఇక్కడమాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. వైసిపి అభ్యర్థి మమ్మద్ ముస్తాఫా షేక్ 74,131 (47శాతం) ఓట్లతో విజేతగా నిలిచారు. టిడిపి అభ్యర్థి మద్దాలి గిరిధర్ 70,980 (45 శాతం) గట్టి పొటీ ఇఛ్చినా విజయం సాధించలేకపోయాడు. మొత్తంగా 2014 ఎన్నికల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో  1,55,549 ఓట్లు పోలయ్యాయి... అంటే 68 శాతం పోలింగ్ నమోదయ్యింది. 

గత అసెంబ్లీ ఎన్నికల్లో (2019) రాష్ట్రవ్యాప్తంగా వైసిపి హవా సాగింది. కాబట్టి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వైసిపి అభ్యర్థి బంపర్ మెజారిటితో గెలిచారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ముస్తాఫా షేక్ మరోసారి బరిలోకి దిగి 77,047 (47శాంతం) ఓట్లు సాధించాడు. ఇక్కడ టిడిపి ముస్లిం సామాజికవర్గానికి చెందిన అభ్యర్థినే బరిలోకి దింపినా ముస్తఫాను ఓడించలేకపోయింది. టిడిపి అభ్యర్థి మహ్మద్ నసీర్ కు 54,956 (34 శాతం) ఓట్లు వచ్చాయి. ఈ నియోజకవర్గ పలితంపై జనసేన ప్రభావం స్పష్టంగా కనిపించింది. జనసేన అభ్యర్థి రహ్మాన్ షేక్ 21,508 (21 శాతం) ఓట్లు సాధించాడు. మొత్తంగా చూసుకుంటే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 1,61,522 ఓట్లు అంటే 70 శాతం పోలింగ్  2019 ఎన్నికల్లో నమోదయ్యింది. 

2024 ఎలక్షన్స్ ఎలా వుండనుంది? 

వైసిపి, టిడిపి అభ్యర్థులు : 

ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఓటు, ప్రతి సీటు కీలకం కానుంది. ఇలా వైసిపి మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే షేక్ ముస్తపానే బరిలోకి దింపేందుకు సిద్దమయ్యింది... కానీ ఆయన కోరిక మేరకు కూతురు షేక్ నూరి ఫాతిమాను అభ్యర్థిగా ప్రకటించింది. తన రాజకీయ వారసురాలి గెలిపించుకుని వైసిపికి హ్యాట్రిక్ విజయం అందించాలని షేక్ ముస్తాఫా ప్రయత్నిస్తున్నారు. 

ఇక్కడ టిడిపి ఇప్పటికీ కాస్త వీక్ గానే వుంది. గత ఎన్నికల్లో టిడిపి నుండి బరిలోకి దిగిన నజీర్ అహ్మద్ ఇంచార్జీగా వున్నా ఆయనకు టిడిపి అవకాశం ఇస్తుందో లేదో అన్న అనుమానం వుంది. ముస్లింకే ఈ సీటు ఇస్తుందా లేక ఇతరులకు ఇస్తుందా అన్నది తేలాల్సి వుంది. గుంటూరు అర్బన్ అధ్యక్షుడు డేగల ప్రభాకర్ ను పోటీలో నిలిపే ఆలోచనలో టిడిపి అధినేత చంద్రబాబు వున్నట్లు తెలుస్తోంది. 

2024 ఎన్నికల్లో గెలుపెవరిది : 

ముస్లింల ప్రభావం అధికంగా వుండటం, టిడిపి-జనసేన కూటమి బిజెపికి సన్నిహితంగా వుండటం ... పొత్తు పెట్టుకునే ఆలోచనలో వుండటం 2024 ఎన్నికల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గంపై ప్రభావం చూపనుంది. ఒకవేళ బిజెపితో పొత్తు వుంటే ఈసారి కూడా గుంటూరు తూర్పు వైసిపిదే అని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అలాకాకుండా టిడిపి‌-జనసేన అభ్యర్థి మాత్రమే బరిలోకి దిగితే టఫ్ ఫైట్ వుంటుందట. ఏదేమైనా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ముస్లింలు ఎటువైపు వుంటే ఆ పార్టీకే విజయావకాశాలు ఎక్కువగా వుంటాయన్నది గత ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Andhra Pradesh: ఏపీలో అస‌లేం జ‌రుగుతోంది.? పెట్రోల్ బంకుల ద‌గ్గ‌ర ఎందుకీ క్యూ లైన్లు, ఇలా ఇంకెన్ని రోజులు.?
KA Paul Trump Event Gunfire: ట్రంప్ పై కాల్పులు జరిగిన ప్రదేశం నుంచి కేఏ పాల్ వీడియో| Asianet Telugu