Andhra Pradesh Exit Poll Surveys : ఏపీలో గెలిచేది వీళ్లే.. . ప్రీపోల్స్ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నది ఇదే..?

By Arun Kumar P  |  First Published May 30, 2024, 10:22 AM IST

ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవలే లోక్ సభతో పాటే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక ఫలితాల వెల్లడే మిగిలింది.  ఈ క్రమంలోనే ఏ పార్టీ గెలుస్తుంది? సీఎం ఎవరు అవుతారు? అనేదానిపై ఉత్కంఠ నెలకొంది... మరి ఎన్నికల సర్వేలు ఏం చెబుతున్నాయంటే... 


అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నాయకులే కాదు ప్రజలు కూడా ఎన్నికల ఫలితాల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది... ఓటర్లు తీర్పు ఇచ్చేసారు. పార్టీలు, అభ్యర్థుల భవితవ్యం ఈవిఎం లలో నిక్షిప్తం అయ్యింది. జూన్ 4న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన వుంటుంది. అయితే అధికార వైఎస్సార్ కాంగ్రెస్, ప్రతిపక్ష టిడిపి, జనసేన,బిజెపి కూటమి ఈ ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకున్నాయి... గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగాయి. దీంతో హోరాహోరి పోరు సాగింది... గెలుపు తమదంటే తమదని వైసిపి, టిడిపి కూటమి ధీమాతో వున్నాయి. 

అయితే ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలకు ముందే పలు సంస్థలు ఓటర్ నాడిని పట్టే ప్రయత్నం చేసాయి. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, ప్రజల మూడ్ ను బట్టి ఏ పార్టీకి విజయావకాశాలు వున్నాయో అంచనా వేసాయి. ఈ ఎన్నికల్లో వైసిపి, టిడిపి కూటమి ప్రదర్శన ఎలా వుండనుంది..? ఏ పార్టీకి ఎన్ని సీట్లు, ఎంత శాతం ఓట్లు వస్తాయి..? ప్రజలు ఎవరివైపు నిలబడేలా వున్నారు..? అనేది ఇప్పటికే ప్రీపోల్ సర్వేలు వెల్లడించాయి. త్వరలోనే (మే 1 సాయంత్రం) ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా వెలువడనున్నాయి. 

Latest Videos

undefined

ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ఫలితాాలపై ప్రీ పోల్ సర్వేలు : 

 1. జీ న్యూస్ - మ్యాట్రిజ్ సర్వే : 

ఆంధ్ర ప్రదేశ్ ఓటర్ల నాడి పట్టేందుకు జీ న్యూస్ ‌- మ్యాట్రిజ్ సర్వే చేపట్టింది.  దీని ప్రకారం ఏపీ ప్రజలు మళ్లీ వైసిపి కే మద్దతుగా నిలిచారని తేలింది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే సీట్లు తగ్గినా వైసిపిదే విజయమని ఈ సర్వే  తేల్చింది. వైసిపి 48 శాతం ఓట్లతో 122 సీట్లు సాధిస్తుందని... టిడిపి కూటమి 44 శాతం ఓట్లతో కేవలం 53 స్థానాలకే పరిమితం అవుతుందని జీ న్యూస్ - మ్యాట్రిజ్ సర్వే  ప్రకటించింది. ఆసక్తికర విషయం ఏమిటంటే జాతీయ స్థాయిలో ప్రధాన పోటీదాురులైన బిజెపి, కాంగ్రెస్ లు ఏపీలో మాత్రం ఖాతా తెరిచే అవకాశాలే లేవని ఈ సర్వే తెలిపింది. అసెంబ్లీ మాదిరిగానే లోక్ సభలో కూడా వైసిపికే అత్యధిక స్థానాలు వస్తాయని ఈ సర్వే తేల్చింది. వైసిపికి 19, కూటమికి కేవలం 6 స్థానాలే వస్తాయని ప్రకటించారు. 

2. టైమ్స్ నౌ - ఈటీజి సర్వే : 

టైమ్స్ నౌ - ఈటీజి దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్ సభ ఎన్నికలపై సర్వే చేపట్టింది. ఇందులో భాగంగానే ఆంధ్ర ప్రదేశ్ లోని 25 లోక్ సభ స్థానాలకు సంబంధించిన సర్వే ఫలితాలను వెల్లడించారు. వైసిపికి  21 నుండి 22, టిడిపి కూటమికి 3-4  ఎంపీ సీట్లు వస్తాయని... బిజెపి, కాంగ్రెస్ లకు ఒక్కసీటు కూడా రావని ప్రకటించారు.టైమ్స్ నౌ - ఈటీజి ప్రత్యేకంగా ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై సర్వే చేపట్టలేదు... కానీ లోక్ సభ స్థానాలపై జరిపిన సర్వే అసెంబ్లీలో కూడా వైసిపి గెలుపని చెబుతోంది. 

3.  ఇండియా టుడే సర్వే : 

ఇండియా టుడే 'మూడ్ ఆఫ్ ది నేషన్' పేరిట దేశంలోని అన్నిరాష్ట్రాల్లోనూ ప్రీ పోల్ సర్వే చేపట్టింది. ఈ క్రమంలోనే ఆంధ్ర ప్రదేశ్ లోకి 25 లోక్ సభ స్థానాల్లో గెలుపు అవకాశాలు టిడిపి కూటమికే ఎక్కువగా వున్నాయని తేల్చింది. టిడిపి అత్యధికంగా 17, వైసిపి కేవలం 8 ఎంపీ సీట్లను మాత్రమే గెలుచుకునే అవకాశాలు వున్నాయని అంచనా వేసింది ఇండియా టుడే. టిడిపికి 45, వైసిపికి 41 శాతం ఓట్లు వస్తాయని ఈ సర్వే తేల్చింది. అయితే ఇండియా టుడే ఈ సర్వేను టిడిపి జనసేన బిజెపి కూటమి ఏర్పాటుకు ముందు జరిపింది.  

4. చాణక్య సర్వే : 

ఆంధ్ర ప్రదేశ్ లో హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో ప్రతిపక్ష టిడిపి కూటమిదే విజయమని చాణక్య సర్వే తేల్చింది. ఎన్నికలకు ముందు ఈ సంస్థ జరిపిన ప్రీ పోల్ సర్వే ప్రకారం టిడిపి కూటమికి 115 నుండి 128 సీట్లు వస్తాయని ప్రకటించారు. వైసిపికి కేవలం 47 నుండి 60 సీట్లు మాత్రమే వస్తాయని చాణక్య సర్వే తేల్చింది.   

5. ఇండియా టీవి - సిఎన్ఎక్స్ సర్వే : 

ఆంధ్ర ప్రదేశ్ లో టిడిపి నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి విజయం సాధిస్తుందని ఎన్నికలకు ముందే ఇండియా టీవి - సిఎన్ఎక్స్ సర్వే తేల్చింది. రాష్ట్రంలోని మొత్తం 25 లోక్ సభ స్థానాల్లో అత్యధికంగా 15 సీట్లు ఈ కూటమి ఖాతాలో చేరతాయట. మిగతా 10 వైఎస్ జగన్ పార్టీకి వస్తాయని ప్రకటించారు. ఆసక్తికర విషయం ఏమిటంటే ఈసారి టిడిపి, జనసేన పొత్తుతో బరిలోకి దిగిన బిజెపికి 3 ఎంపీ సీట్లు వస్తాయని తెలిపారు. టిడిపి మరో 12 చోట్ల గెలుస్తుందని ఇండియా టివి ప్రీపోల్ సర్వే చెబుతోంది. అంటే ఇదే ఫలితం అసెంబ్లీలోనూ కనిపించే అవకాశాలు వున్నాయి. 

6.  డెక్కన్ 24/7 సర్వే :

ఈ ప్రీ పోల్ సర్వే వైసిపికి గెలుపు అవకాశాలు ఎక్కువగా వున్నాయిని తేల్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా బంపర్ మెజారిటీ రాకున్నా విజయం మాత్రం వైసిపిదేనట. 100 కు పైగా సీట్లతో వైసిపి మళ్లీ అధికారంలోకి వస్తుందని తెలిపింది.  టిడిపి కూటమికి కేవలం 65 కు అటూఇటుగానే సీట్లు వస్తాయట. మరో పది నియోజకవర్గాల్లో నువ్వా నేనా అన్నట్లుగా టఫ్ ఫైట్ వుంటుందని డెక్కన్ 24/7 సర్వే తెలిపింది. 

7. ఎలెసన్స్ సర్వే : 

2024 మార్చి  21 నుండి ఏప్రిల్ 12 వరకు ఆంధ్ర ప్రదేశ్ లో ఎలెసన్స్ అనే సంస్థ సర్వే నిర్వహించింది. ఇందులో మళ్లీ వైసిపిదే పైచేయిగా తేలింది. మొత్తం 175 అసెంబ్లీ సీట్లకుగాను వైసిపి 50 శాతం ఓట్లతో 127, టిడిపి జనసేన బిజెపి కూటమి 45 శాతం ఓట్లతో 48 సీట్లు సాధిస్తుందని ఈ సర్వే తేల్చింది. 

8. పొలిటికల్ క్రిటిక్ సర్వే : 

ఈ ప్రీ పోల్ సర్వే కూడా మళ్లీ అధికారం వైసిపిదేనని చెబుతోంది. తామ సర్వేలో వైసిపికి 120 నుండి 125 సీట్లు, టిడిపి కూటమి కేవలం 50 నుండి 55 సీట్లకు మాత్రమే పరిమితం అవుతుందని తెలిపారు. లోక్ సభ స్ధానాల విషయానికి వస్తే వైసిపికి 19 నుండి 22, టిడిపి కూటమికి 3 నుండి 6 ఎంపీ లను గెలుచుకుంటుందని వెల్లడించారు. 

9. న్యూస్ ఎరినా ఇండియా సర్వే : 

అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు వైఎస్సార్ కాంగ్రెస్ దక్కించుకుంటుందని న్యూస్ ఎరినా ఇండియా సర్వే తేల్చింది. వైస్ జగన్ పాలననే ప్రజలు మెచ్చారని... అందువల్లే ఆయనే సీఎంగా వుండాలని కోరుకుంటున్నారని తమ సర్వేలో తేలిందన్నారు. వైసిపికి 122, టిడిపికి 53 సీట్లు వస్తాయని తెలిపింది. టిడిపి మళ్ళీ ప్రతిపక్షానికే పరిమితం అయినా గత ఎన్నికల కంటే సీట్లను పెంచుకుంటుందని ఈ సర్వే తెలియజేస్తోంది.   

10. ఆత్మసాక్షి సర్వే :  

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపికి 97 నుండి 118, టిడిపి కూటమికి 54 నుండి 62 సీట్లు వస్తాయని ఆత్మసాక్షి సర్వే తేల్చింది. 27 స్ధానాల్లో మాత్రం వైసిపి, టిడిపి కూటమి  మధ్య హోరాహోరీ పోరు వుండనుందట. మొత్తంగా మళ్ళీ అధికారాన్ని చేపట్టుది వైసిపినే అని ఈ ప్రీ పోల్ సర్వే చెబుతోంది. 

 అయితే పోలింగ్ కు ముందు, ఆ తర్వాత రాజకీయ పరిస్థితులకు చాలా తేడా కనిపిస్తోంది. చాలా సర్వేలు టిడిపి, జనసేన, బిజెపి కూటమి ఏర్పాటుకంటే ముుందే సర్వేలు చేపట్టాయి. అలాగే పోలింగ్ రోజు. ఆ తర్వాత కూడా పలుప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘర్షణ వాతావరణం ఎన్నికల ఫలితాలపై అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది. పోలింగ్ రోజునే ప్రజల మూడ్ అర్థమైపోయింది... అందువల్లే గెలుపోటములపై ఓ అంచనాకు వచ్చిన పార్టీలు, అభ్యర్థులు ఈ ఉద్రిక్తతలకు కారణమయ్యారని తెలుస్తోంది. అంటే పోలింగ్ రోజున ఓటర్ల మూడ్ ఎలా వుంది... ఎవరికి ఓటేసారు అనేదే గెలుపోటములను నిర్ణయిస్తుంది... ఈ సర్వేలన్నకేవలం అంచనాలు మాత్రమే. 

click me!