ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 14 నుండి ప్రారంభం కానున్నాయి. ఈ బడ్జెట్ సమావేశాలను గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రారంభించనున్నారు.
అమరావతి: ఈ ఏడాది మార్చి 14 నుండి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు అనుమతివ్వాలని కోరుతూ ప్రభుత్వం గవర్నర్ కు శుక్రవారం నాడు ప్రతిపాదనలు పంపింది. దీనికి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇవాళ ఉదయమే అబ్దుల్ నజీర్ ఏపీ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను కనీసం 13 రోజుల పాటు నిర్వహించనున్నారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను మార్చి 14న గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ప్రసంగం తర్వాత నిర్వహించే బీఏసీ సమావేశంలో అసెంబ్లీ పని దినాలపై నిర్ణయం తీసుకోనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ లో సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఏపీ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసే అవకాశం లేకపోలేదు.