ఢిల్లీ లిక్కర్ స్కాంలో తన కొడుకు క్లీన్ గా బయటపడుతాడని వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ధీమాను వ్యక్తం చేశారు.
నెల్లూరు: తన కొడుకు ఎలాంటి తప్పు చేయలేదని వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో తన కొడుకు క్లీన్ గా బయటకు వస్తారని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.
శుక్రవారం నాడు ఒంగోలులో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మీడియాతో మాట్లాడారు. పెద్దనాన్న, మీ పేరును అప్రతిష్టపాలు చేసేలా తాను వ్యవహరించలేదని రాఘవరెడ్డి తనకు చెప్పారన్నారు. తమ కుటుంబం 32 ఏళ్ల నుండి రాజకీయాల్లో ఏ తప్పు చేయకుండా ఉందన్నారు. అంతేకాదు 70 ఏళ్లుగా తమ కుటుంబం వ్యాపారాలు నిర్వహిస్తుందని ఆయన గుర్తు చేశారు.వ్యాపారాల్లో కూడా ఎవరూ కూడా ఇంతవరకు తమను వేలెత్తి చూపలేదన్నారు.దేశంలోని పది రాష్ట్రాల్లో తమ వ్యాపాలు విస్తరించినట్టుగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి చెప్పారు.
undefined
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు రాఘవరెడ్డిని ఈడీ అధికారులు ఈ నెల 11న అరెస్ట్ చేశారు. 2022 అక్టోబర్ మాసంలో మాగుంట రాఘవరెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. మాగుంట శ్రీనివాస్ రెడ్డి నివాసాల్లో గతంలో సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో రెండో చార్జీషీట్ లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ , బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తదిరుల పేర్లను చేర్చారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సౌత్ లాబీపై దర్యాప్తు సంస్థలు తీవ్ర ఆరోపణలు చేశాయి. సౌత్ లాబీ నుండి అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ ముడుపులు తీసుకుందని ఈడీ ఆరోపణలు చేసింది. ఈ ముడుపులను గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఖర్చు చేసిందని చార్జీషీట్లలో పేర్కొంది.
హైద్రాబాద్ కు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ బుచ్చిబాబును ఇటీవలనే దర్యాప్తు అధికారులు అరెస్ట్ చేశారు. బుచ్చిబాబు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు గతంలో ఆడిటర్ గా పనిచేశారు. కవితతో పాటు పలువురికి ఆయన ఆడిటర్ గా ఉన్నారని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో బెయిల్ ధరఖాస్తు చేసుకున్న నిందితులకు ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు బెయిల్ ను తిరస్కరించింది. ఈ మేరకు గత వారంలో బెయిల్ ను తిరస్కరించింది.
also read:ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం: అరవింద్ కేజ్రీవాల్ పీఏకు ఈడీ నోటీసులు
ఢిల్లీ లిక్కర్ స్కాంపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సీబీఐ విచారణకు ఆదేశించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంపై ఆరోపణలు రావడంతో ఈ పాలసీని ఢిల్లీ ప్రభుత్వం రద్దు చేసింది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కాం పాలసీ తయారీలో కూడా సౌత్ లాబీ కీలకంగా వ్యవహరించిందని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో రోజుకొకరిని దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేస్తున్నాయి. దీంతో ఏ రోజు ఎవరిని అదుపులోకి తీసుకొంటారోననే చర్చ సాగుతుంది.