
న్యూఢిల్లీ:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు శుక్రవారం నాడు నోటీసులు జారీ చేసింది. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్న మూడు గ్రామ పంచాయితీలకు ఎన్నికలు నిర్వహించాలని నోటిఫై చేసినందుకు నోటీసులు జారీ చేసింది.
ఒడిశా ప్రభుత్వం గురువారం నాడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తన భూభాగాన్ని ఏపీ సర్కార్ ఆక్రమించిందని ఆరోపించింది.నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలని కోరింది. యథాతథస్థితిని ఉద్దేశ్యపూర్వకంగా ఉల్లంఘిస్తున్నారని ఆ పిటిషన్ లో ఒడిశా ఆరోపించింది. కోర్టు తీర్పును ధిక్కరించినందుకు శిక్షించాలని కోరింది.ఈ గ్రామాల్లో ఎన్నికలు జరిగాయని ఏపీ ప్రభుత్వం వాదించింది.
ఈ పిటిషన్ పై సమాధానం చెప్పాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్ పై విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది.1968 డిసెంబర్ 2న ఉన్నత న్యాయస్థానం కీలక తీర్పు ఇచ్చింది. రెండు రాష్ట్రాలు యథాతథస్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాజ్యాంగంలోని 131 కింద ఒడిశా దాఖలు చేసిన దావా చివరకు ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. అయితే వివాదం పరిష్కారమయ్యే వరకు యథాతథస్థితిని కొనసాగించాలని కోర్టు ఆదేశించింది.
ఒడిశా ప్రభుత్వం ముగ్గురు అధికారులపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టును కోరింది. విజయనగరం జిల్లా కలెక్టర్ ముడే జవహర్ లాల్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని కోరింది.కోటియా గ్రూప్ గ్రామాలుగా 21 గ్రామాలు పేరొందాయి. ఈ గ్రామాల విషయమై రెండు రాష్ట్రాల మధ్య చాలా కాలంగా వివాదం కొనసాగుతోంది.