కృష్ణా-గోదావరి నదుల అనుసంధానానికి నిధులు ఇవ్వాలని జగన్ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్రం కూడ సానుకూలంగా స్పందించింది.
అమరావతి:కృష్ణా-గోదావరి నదుల అనుసంధానానికి సహాయం చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ కేంద్రప్రభుత్వాన్ని కోరారు. సీఎం జగన్ రాసిన లేఖను ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ కు అందించారు.
నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో తీవ్ర కరువు పరిస్థితులున్నాయి. గత పదేళ్లుగా రాష్ట్రంలో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయని ఆా లేఖలో సీఎం ప్రస్తావించారు. మహారాష్ట్ర, కర్ణాటకలు నిర్మిస్తున్న ప్రాజెక్టుల వల్ల తమ రాష్ట్రంలోని ప్రాజెక్టులకు నీరు రావడం లేదని ఆయన గుర్తు చేశారు.ఆల్మట్టి ఎత్తును 519.6 మీటర్ల నుండి 524.2 మీటర్లకు పెంచుతున్నారు. దీని వల్ల తమ రాష్ట్రానికి వచ్చే 100 టీఎంసీల నీరు కూడ రాని పరిస్థితి నెలకొందని జగన్ చెప్పారు.
గోదావరి జలాలు పెద్ద ఎత్తున సముద్రంలో కలుస్తున్నాయి, గోదావరి నీటిని కృష్ణా బేసిన్ లోకి తరలించాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. గోదావరి నీటిని సాగర్, శ్రీశైలానికి ఎత్తిపోయడం వల్లే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తోందన్నారు.
ఈ విషయమై రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ అయినట్టుగా ఆయన ఆ లేఖలో ప్రస్తావించారు. ప్రతి రోజూ 4 టీఎంసీల చొప్పున 120 రోజుల్లో 480 టీఎంసీల నీటిని తరలించే అవకాశం ఉందని నిపుణులు చెప్పిన విషయాన్ని జగన్ చెప్పారు.
కృష్ణా-గోదావరి నదుల అనుసంధానానికి సహాయం చేయాలని సీఎం జగన్ కేంద్ర మంత్రిని కోరారు.ఈ లేఖపై కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ సానుకూలంగా స్పందించినట్టుగా వైఎస్ఆర్‌సీపీ నేత విజయసాయిరెడ్డి చెప్పారు.