
సమతామూర్తి శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు (Ramanuja Sahasrabdi Utsav) రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. వంటి పలువురు ప్రముఖులు రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకలకు హాజరయ్యారు. నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాలకు హాజరుకానున్నారు. ఇందుకోసం సీఎం వైఎస్ జగన్ సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్నారు.
సోమవారం మధ్యాహ్నం 3.50 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి సీఎం Jagan హైదరాబాద్ బయలుదేరనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ముచ్చింతల్‌లోని శ్రీరామనగరం చేరుకుని.. సమతామూర్తిని దర్శించుకుంటారు. రాత్రి 7.30 గంటల వరకు సహస్రాబ్ది ఉత్సవాలలో పాల్గొంటారు. అనంతరం సీఎం జగన్ అక్కడి నుంచి బయలుదేరి రాత్రి 9.05 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకోనున్నారు.
ఇక, నేడు ముచ్చింతల్‌లో ఆరోరోజు రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకలు కొనసాగుతున్నాయి. వేడుకల్లో నేడు మరో కీలక ఘట్టం చోటుచేసుకోనుంది. సమతామూర్తి కేంద్రంలోని 108 దివ్యదేశాల్లో 33 ఆలయాలకు ప్రాణప్రతిష్ట చేయనున్నారు. యాగశాలలో సంస్కరించన 33 స్త్రీ దేవతామూర్తులతో భోభాయాత్ర జరగనుంది. యాగశాల నుంచి దివ్యదేశాల వరకు దేవతామూర్తులతో శోభాయాత్రను నిర్వహించనున్నారు.
ఇక, రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకలకు హాజరయ్యేందుకు రేపు (ఫిబ్రవరి 8) కేంద్ర మంత్రి అమిత్‌షా, 9న ఆరెస్సెస్ చీఫ్ మోహన్‌భగవత్, 10న కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్,11న కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ, 12న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, 13న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముచ్చింతల్‌కు రానున్నారు.