అన్ని నివేదికలు అందాల్సిందే.. తర్వాతే ఆనందయ్య మందు పంపిణీ: ఏపీ సర్కార్

Siva Kodati |  
Published : May 23, 2021, 08:19 PM IST
అన్ని నివేదికలు అందాల్సిందే.. తర్వాతే ఆనందయ్య మందు పంపిణీ: ఏపీ సర్కార్

సారాంశం

కరోనా రోగులు, ప్రజలు ఆశలు పెట్టుకున్న కృష్ణపట్నం ఆనందయ్య మందు పంపిణీ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐసీఎంఆర్, ఆయుష్ సహా నిపుణుల నివేదికలు అందే వరకు మందు పంపిణీని నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

కరోనా రోగులు, ప్రజలు ఆశలు పెట్టుకున్న కృష్ణపట్నం ఆనందయ్య మందు పంపిణీ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐసీఎంఆర్, ఆయుష్ సహా నిపుణుల నివేదికలు అందే వరకు మందు పంపిణీని నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. నివేదికలు రాకుండా మందు పంపిణీ సాధ్యం కాదని ప్రభుత్వం చెబుతోంది. ఐసీఎంఆర్ నివేదికకు సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. 

మరోవైపు కృష్ణపట్నం ఆయుర్వేదం మందుపై నివేదిక అందాల్సి వుందన్నారు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. సాంప్రదాయంగా వాడే మందులను ప్రభుత్వం కట్టడి చేయాల్సిన అవసరం లేదన్నారు.

ఆనందయ్య మందులో నష్టం కలిగించేది ఏమీ లేవని చెబుతున్నారని అనిల్ కుమార్ తెలిపారు. సంప్రదాయ మందుకు, ఆయుర్వేద మందుకు తేడా వుంటుందని.. ఆయుర్వేద మందుగా గుర్తించాలంటే కొన్ని పద్ధతులు పాటించాల్సి వుంటుందని ఆయన పేర్కొన్నారు. 

Also Read:ఆనందయ్య మందుకు అనుమతిస్తే ఆయుర్వేద ఫార్మసీలో తయారీకి సిద్దం: చెవిరెడ్డి

కాగా, ఆనందయ్య మందును ఆయుర్వేదంగా గుర్తించే అవకాశం వుందన్నారు ఆయుష్ కమీషనర్ రాములు. మందుపై తుది అధ్యయనం జరుగుతుందన్నారు. నిబంధనల ప్రకారం క్లినికల్ ట్రయల్స్ పూర్తయితే ఆయుర్వేదంగా గుర్తించవచ్చని రాములు తెలిపారు.

మందు తయారీలో వాడుతున్న పదార్ధాలన్నీ ఆయుర్వేదంలో ఉపయోగించేవేనని.. ఇవాళ సాయంత్రానికల్లా నివేదిక ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని రాములు వెల్లడించారు. క్లినికల్ ట్రయల్స్, లైసెన్స్ వంటివి పూర్తయితే ఆయుర్వేదంగా గుర్తించవచ్చని పేర్కొన్నారు. ఆయుర్వేదంగా గుర్తింపు ఇచ్చే అంశం రాష్ట్ర పరిధిలో వుంటుందని.. కానీ కేంద్ర సాయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్