
అనకాపల్లి .. పేరు వినగానే ఏదో సాఫ్ట్ అనుకుంటే పోరపాటే. వర్గపోరు, గొడవలు, ఎత్తులకు పైఎత్తులు, ఆధిపత్య పోరు అన్నీ కలిపితే అనకాపల్లి. ఇక్కడి రాజకీయం ఎప్పుడూ హాట్ హాట్‌గానే వుంటుంది. 1962లో ఏర్పాటైన ఈ నియోజకవర్గంలో తొలినాళ్లలో కాంగ్రెస్, టీడీపీ మధ్య హోరాహోరీ పోరు నడిచింది. అయితే కాంగ్రెస్, లేదంటే టీడీపీకి చెందిన నేతలే అనకాపల్లి ఎంపీలుగా గెలిచేవారు. ఇక్కడ కాంగ్రెస్ 9 సార్లు, టీడీపీ 5 సార్లు , వైసీపీ ఒకసారి విజయం సాధించాయి.
అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో చోడవరం, మాడుగుల, అనకాపల్లి, పెందుర్తి, ఎలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం అసెంబ్లీ స్థానాలున్నాయి. పారిశ్రామికంగా, మైనింగ్ పరంగా, వ్యవసాయం ఇలా అన్ని విధాలుగా అనకాపల్లి పార్లమెంట్ స్థానం కీలకమైనది. అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో కాపులదే ఆధిపత్యం.. ఆ తర్వాత యాదవుల ఓట్లు గణనీయంగా వున్నాయి.
అనకాపల్లి ఎంపీ (లోక్‌సభ) ఎన్నికల ఫలితాలు 2024 .. కాపులదే అడ్డా :
అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 15,21,363 మంది . వీరిలో పురుషులు 7,71,059 మంది.. మహిళలు 7,50,238 మంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 12,38,491 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా.. 81.14 శాతం పోలింగ్ నమోదైంది. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ..అనకాపల్లి పరిధిలోని మొత్తం ఏడు నియోజకవర్గాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి బీశెట్టి వెంకట సత్యవతికి 5,86,226 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి అడారి ఆనంద్ కుమార్‌కి 4,97,034 ఓట్లు.. జనసేన అభ్యర్ధి చింతల పార్ధసారథికి 82,588 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా వైసీపీ 89,192 ఓట్ల మోజారిటీతో అనకాపల్లిని కైవసం చేసుకుంది.
అనకాపల్లి ఎంపీ (పార్లమెంట్) ఎన్నికల ఫలితాలు 2024 .. బరిలో నిలిచేదెవరు :
వైసీపీ నుంచి సిట్టింగ్ ఎంపీగా వున్న డాక్టర్ సత్యవతికి మరోసారి జగన్ అవకాశం కల్పించే పరిస్ధితులు కనిపించడం లేదు. మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ను కానీ సామాజికంగా, ఆర్ధికంగా బలవంతుడైన నేతను ఇక్కడ పోటీ చేయించాలని జగన్ భావిస్తున్నారు. టీడీపీ విషయానికి వస్తే.. జనసేనతో పొత్తులో వున్న కారణంతో పవన్ కళ్యాణ్ అనకాపల్లిని కోరుతున్నారు. తన సోదరుడు నాగబాబును ఇక్కడి నుంచి పోటీ చేయించాలని పవన్ భావిస్తున్నారు.
అందుకు తగ్గట్టుగానే గడిచిన పదిరోజులుగా అనకాపల్లి పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు మెగాబ్రదర్. అయితే అనకాపల్లి ఎంపీ టికెట్ ఇస్తారన్న హామీతో జనసేనలో చేరిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ పరిస్ధితి.. ఇప్పుడు నాగబాబు ఎంట్రీతో అయోమయంగా మారింది. నాగబాబు వచ్చినా ఆయన పాల్గొన్న కార్యక్రమాలకు కొణతాల వెళ్లకుండా ముఖం చాటేశారు. దీంతో నాగబాబు స్వయంగా కొణతాల ఇంటికి వెళ్లి బుజ్జగించారు.
అయితే టీడీపీని ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఎలా కన్విన్స్ చేస్తారనే సస్పెన్స్‌గా మారింది. అనకాపల్లి నుంచి టికెట్ ఆశిస్తున్న బైరా దిలీప్ చక్రవర్తి దాదాపు ఏడాదిన్నరగా పనిచేసుకుంటూ పోతున్నారు. అలాగే సీనియర్ నేత , మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తనయుడు చింతకాయల విజయ్ కూడా అనకాపల్లి టికెట్ ఆశించారు. తన కుమారుడిని ఎంపీగా చూడాలనుకుంటున్న అయ్యన్న.. నాగబాబు అభ్యర్ధిగా అంటే ఒప్పుకుంటారా అన్నది చూడాలి.