ఈ నెల 17వ తేదీన టీడీపీ, జనసేన పార్టీలు ఉమ్మడిగా మరో సభను నిర్వహించనున్నాయి. ఈ సభలో ఉమ్మడి మ్యానిఫెస్టోను విడుదల చేస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్‌ను ముందుకు తీసుకెళ్లే విధానాలను వెల్లడిస్తామని నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడులు ఉమ్మడి ప్రెస్‌మీట్‌లో వెల్లడించారు.
Janasena: తాడేపల్లిగూడెంలో టీడీపీ - జనసేన ఉమ్మడి సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ జెండా సభ విజయవంతంగా నిర్వహించారు. ఉభయ పార్టీల అధ్యక్షులు వేదిక పంచుకుని ఓటు బదలాయింపునకు దారులు వేశారు. అదే సభలో ఉమ్మడి మ్యానిఫెస్టోను త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సభ గురించి టీడీపీ, జనసేన పార్టీలు కీలక ప్రకటన చేశాయి.
ఈ రోజు టీడీపీ కార్యాలయంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఉమ్మడి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో ఇద్దరు మాట్లాడుతూ చిలకలూరిపేటలో ఈ నెల 17వ తేదీన మరో బహిరంగ సభ నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ సభలో ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల చేస్తామని ప్రకటించారు. రాష్ట్రానికి దశ, దిశ చూపించేలా సభ నిర్వహిస్తామని వెల్లడించారు.
ఈ సమావేశంలో నాదెండ్ల మాట్లాడుతూ.. ఉమ్మడి మ్యానిఫెస్టోతోపాటు రాష్ట్రాన్ని భవిష్యత్‌లో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నామో వివరిస్తామని చెప్పారు. ప్రతి కుటుంబానికి సంక్షేమం, ప్రతి ప్రాంతానికి అభివృద్ధి లక్ష్యంగా ప్రణాళిక ఉంటుందని వివరించారు. విపక్షాల సభలను అడ్డుకోవడానికి వైసీపీ శాయశక్తుల ప్రయత్నాలు చేస్తున్నదని, ఇందులో అధికారులు బలికావొద్దని సూచించారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ భద్రతా సిబ్బంది, జనసేన పార్టీ మీడియా సిబ్బంది, సోషల్ మీడియా సిబ్బంది గదుల్లోకి పోలీసులు బలవంతంగా దూసుకెళ్లి సుమారు 40 నిమిషాలపాటు తనిఖీలు చేయడాన్ని తప్పుబట్టారు. వాచ్‌మెన్‌ను తుపాకీతో బెదిరించి, గోడలు దూకి తనిఖీలు చేయాల్సిన అవసరం ఏమున్నదని? ఎవరి ప్రోద్బలంతో పోలీసులు వచ్చారని ఆయన ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని పేర్కొన్నారు. దీనిపై న్యాయపరంగా పోరాడుతామని, పోలీసులకు ఫిర్యాదు చేస్తామని వివరించారు.
Also Read: CM Revanth Reddy: రేపు ఢిల్లీకి చంద్రబాబు, రేవంత్ రెడ్డి
అచ్చెన్నాయుడు కూడా ఈ ఘటనను ఖండించారు. చిలకలూరిపేట సభను విజయవంతం చేయాలని పిలుపు ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా సభలు నిర్వహించుకునే హక్కు ఉన్నదని, కానీ, ఏపీలో ప్రతిపక్షాల సభకు కనీసం ఆర్టీసీ బస్సులు కూడా ఇవ్వడం లేదని వాపోయారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.