
ఆంధ్రప్రదేశ్‌లో అమ్మ ఒడి (Amma Vodi) పథకాన్ని అమలు చేస్తున్న వైఎస్ జగన్ (YS Jagan) సర్కార్.. ఆ పథకం పొందాలంటే 75 శాతం హాజరు తప్పనిసరి చేస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిని అమలు చేసేందుకు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తల్లిదండ్రులకు లేఖలు రాస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలోనే ఇలా చేస్తున్నట్టుగా ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. ఇందులో పిల్లల హాజరు 75 శాతం ఉండేలా చూడాలని లేఖల్లో పేర్కొంటున్నారు. ఈ లేఖలపై తల్లిదండ్రుల సంతకం (Parents Signature) చేయించుకుని తీసుకురావాలని విద్యార్థులకు చెబుతున్నారు.
అమ్మ ఒడి పథకం కోసం విద్యార్థుల హాజరు కూడా ప్రభుత్వం నిర్దేశించిన యాప్‌లో నమోదు చేస్తున్నట్టుగా ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఇక, ఈ ఏడాది అమ్మ ఒడి పథకానికి సంబంధించిన డబ్బులను వచ్చే ఏడాది జూన్‌లో ఇవ్వనున్నట్టుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒకవేళ 75 శాతం హాజరు లేని విద్యార్థులకు.. అమ్మ ఒడి డబ్బులు అందకపోతే.. తల్లిదండ్రుల నుంచి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు ఈ చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తోంది.
అమ్మ ఒడిపై మంత్రి పేర్ని నాని..
ఇటీవల మీడియాతో మాట్లాడిన పేర్ని నాని.. 2021 నవంబర్ 8 నుంచి 2022 ఏప్రిల్30 వరకు సుమారు 130 రోజులు విద్యా సంవత్సరంగా ఉందని చెప్పారు. ఇందులో ఖచ్చితంగా75 శాతం హాజరు ఉంటేనే విద్యార్థులు అమ్మ ఒడి పథకానికి అర్హులు అవుతారని స్పష్టం చేశారు. గత రెండేళ్లుగా కరోనా ఉండటంతో ఈ నిబంధనను అమలు చేయలేదని చెప్పారు. ఇక నుంచి ఖచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు, పిల్లలు పాఠశాలలకు హాజరయ్యేలా చూడాలని మంత్రి కోరారు. అటు ఉపాధ్యాయలు సైతం పాఠశాలలలో విద్యార్థుల హాజరు శాతం పెంచడానికి కృషి చేయాలన్నారు.
ఇక, ఏపీ ప్రభుత్వం మనబడి .. నాడు–నేడు కింద కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు విద్యార్థుల తల్లులకు జగనన్న అమ్మఒడి కింద ఏటా రూ.15 వేలు, జగనన్న విద్యాకానుక కింద 3 జతల యూనిఫామ్, షూ, బెల్టు, బ్యాగు, పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్‌బుక్స్, డిక్షనరీ అందిస్తోంది. విద్యార్థులకు జగనన్న గోరుముద్ద కింద పౌష్టికాహారం అందిస్తోంది. 1 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులకు Amma Vodiని అందిస్తున్న సంగతి తెలిసిందే.