చంద్రబాబును ఉతికి ఆరేసిన అమిత్ షా ..చంద్రబాబుది దురుద్దేశ్యమే

First Published Mar 24, 2018, 11:31 AM IST
Highlights
  • ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా గట్టి కౌంటర్‌ ఇచ్చారు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా గట్టి కౌంటర్‌ ఇచ్చారు. రాజకీయ దురుద్దేశంతోనే చంద్రబాబు కూటమి నుంచి వైదొలిగినట్లు లేఖలో ఘాటుగా స్పందించారు. ఎన్డీయే కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటిస్తూ, అందుకు కారణాలు వివరిస్తూ అంతకుముందు చంద్రబాబు రాసిన లేఖకు అమిత్‌ గట్టిగానే బదులు లేఖ పంపించారు. చంద్రబాబు నిర్ణయంలో అభివృద్ధి ఎజెండా కంటే రాజకీయ ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నాయని మండిపడ్డారు. చంద్రబాబు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని దుయ్యబట్టారు.

మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికోసం అన్ని రకాలుగా సహకరించిందని స్పష్టం చేశారు. ఏపీ విభజన సమయంలో తెలుగు రాష్ట్రాల హక్కులను పరిరక్షించడంలో బీజేపీ ముందుందని చెప్పారు. ఏపీ ప్రజల ఆకాంక్షలపట్ల బీజేపీకి ఏమాత్రం సానుభూతి లేదని మీరు (చంద్రబాబు) చెబుతున్న మాటలన్నీ కూడా అబద్ధాలు, నిరాధారాలు అని అమిత్‌షా ధ్వజమెత్తారు.

ఎన్డీయే సర్కార్‌ ఏపీకి ఇచ్చే కేంద్ర సహాయాన్ని రెండింతలు పెంచిందని, బీజేపీ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదన్నారు. రాజధాని కోసం కేంద్రం విడుదల చేసిన నిధుల్లో కేవలం 8శాతం మాత్రమే ఏపీ వాడుకుందన్నారు. పోలవరానికి రూ.5,364కోట్లు కేటాయించామని చెప్పిన ఆయన చంద్రబాబు ప్రభుత్వం నుంచి జరిగిన తీవ్రమైన తప్పిదాలను ఎప్పటికీ విస్మరించలేమన్నారు.

కేంద్రం నిధులకు సంబంధించి ఎలాంటి లెక్కలు ఇప్పటి వరకు చంద్రబాబు ప్రభుత్వం సమర్పించలేదని, ప్రభుత్వాలు ప్రతి పైసా ఖర్చుపై ప్రజలకు లెక్క చెప్పాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు. ఎన్డీయేకు మద్దతు ఎందుకు ఉపసంహరించుకోవాల్సి వచ్చిందో చంద్రబాబునాయుడు వివరిస్తూ అమిత్‌షాకు ఓ లేఖ రాసిన విషయం తెలిసిందే.

 

click me!