
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా పలు తీర్మానాలపై చర్చ సాగుతుంది. ఈ క్రమంలోనే ఎల్లో మీడియా- దుష్ట చతుష్టయం తీర్మానంపై చర్చను మంత్రి అంబటి రాంబాబు ప్రారంభించారు. రాష్ట్రంలో ఏ గడప తట్టినా జగన్ నినాదమే మారుమోగుతోందని అన్నారు. దుష్టచతుష్టయాన్ని ఎదుర్కొవడానికి సిద్దంగా ఉన్నామని చెప్పారు. దత్తపుత్రుడు పార్టీ పెట్టిందే చంద్రబాబు కోసం అని విమర్శించారు. చంద్రబాబుకు తోడుగా దత్త పుత్రుడు ఉన్నాడని.. దత్తపుత్రుడు ఫ్యాన్స్ మాత్రం సీఎం సీఎం అంటంటారని అన్నారు. దత్త పుత్రుడు మాత్రం.. ప్యాకేజీ తీసుకుని చంద్రబాబు సీఎం సీఎం అంటాడని ఎద్దేవా చేశారు.
అధికారం లాక్కోవడానికి చంద్రబాబు తాపత్రం అని మండిపడ్డారు. దుష్టచతుష్టయంతో కలిసి ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఏ గడప తట్టినా జగన్ నినాదమే మారుమోగుతోందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. కష్టపడి అధికారంలోకి వచ్చిన ఏకైక వ్యక్తి జగన్ అన్నారు.
జోగి రమేష్ మాట్లాడుతూ.. ఏపీలో జరుగుతున్న అభివృద్దిని చూసి ఓర్వలేకే ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో గజ దొంగలు ముఠాగా ఏర్పడి రాష్ట్రాన్ని దోచుకున్నారని విమర్శించారు. కానీ రామోజీ రావు, ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ 5 నాయుడు.. వైఎస్ జగన్‌పై విషం చిమ్ముతున్నారని విమర్శించారు. కంపు వార్తలను ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబుకు ఇళ్లు లేదు, అడ్రస్ లేదని ఎద్దేవా చేశారు. ఈ ఎల్లో మీడియా ఓనర్లకు కూడా ఏపీలో అడ్రస్ లేదని విమర్శించారు.
పేదల ఇంగ్లిష్ మీడియాన్ని అడ్డుకునేందుకు దుష్టచతుష్టయం యత్నిస్తోందని మండిపడ్డారు. వాళ్ల పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోలేదా అని ప్రశ్నించారు. పేదల పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుతుంటే చంద్రబాబుకు ఎందుకు కడుపు మంటా అని ప్రశ్నించారు. రఘురామ కృష్ణరాజు తల్లి పాలు తాగి రొమ్మునే గుద్దుతున్నారని విమర్శించారు. తమకు కూడా బూతులు వచ్చని.. తాము జగన్ కోసం దేనికైనా సిద్దమని చెప్పారు. చంద్రబాబు జగన్ కాలిగోటికి కూడా సరిపోడని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.