కేంద్రం చూస్తూ ఊరుకోదు: అమరావతిపై జగన్ సుజనా హెచ్చరిక

By telugu teamFirst Published Jan 11, 2020, 11:12 AM IST
Highlights

అమరావతి నుంచి రాజధానిని మార్చాలనే వైఎస్ జగన్ ప్రతిపాదనపై బిజెపి ఎంపీ సుజనా చౌదరి తీవ్రంగా మండిపడ్డారు. జగన్ దారుణాలను వ్యతిరేకించకపోతే తాను పదవిలో ఉండి ఏం లాభమని ఆయన ప్రశ్నించారు.

విజయవాడ: రాజధాని విషయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకుంటున్న చర్యలను కేంద్రం చూస్తూ ఊరుకోదని బిజెపి పార్లమెంటు సభ్యుడు సుజనా చౌదరి హెచ్చరించారు. రైతుల ఆందోళన చూస్తుంటే బాధగా ఉందని ఆయన అన్నారు. మహిళలు, రైతులు దుర్గమ్మ గుడికి వెళ్తుంటే అడ్డుకోవడం దారుణమని ఆయన అన్నారు.

రాజధాని గ్రామాల్లో పూజలు చేసుకోవడం తప్పవుతుందా అని ఆయన ప్రశ్నించారు. శనివారం విజయవాడలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాజధాని ప్రాంతాల్లో ర్యాలీలకు అనుమతి లేదంటున్న పోలీసులు వైసీపీ ర్యాలీలకు ఎలా అనుమతి ఇస్తున్నారని ఆయన ప్రశ్నించారు. 

మీ కులం ఏమిటని పోలీసులు అడగడం దారుణమని ఆయన అన్నారు ఏది చేయాలన్నా చట్టప్రకారం చేయాలని ఆయన అన్నారు. ఆరు నెలల్లో ఇంత దారుణంగా వ్యవహరించిన ముఖ్యమంత్రిని తాను చూడలేదని ఆయన అన్నారు. 

రాష్ట్రంలో కల్లోలం సృష్టించి పైశాచిక ఆనందం పొందినట్లు జగన్ వ్యవహారం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ చేస్తున్న చర్యల వల్ల ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించే పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో 13 జిల్లాల ప్రజలు ఉద్యమించాలని ఆయన అన్నారు. మేధావులు, ఎన్జీవోలు, పెన్షనర్లు ఉద్యమించాలని ఆయన అన్నారు. 

రాష్ట్ర ప్రజలకు మద్దతుగా తమ బిజెపి పోరాడుతుందని, ఈ పోరాటానికి కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకుంటామని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామా, అఫ్గనిస్తాన్ లో ఉన్నామా అని ఆయన ప్రశ్నించారు. ఇటువంటివి ఆపలేకపోతే మనం పదవుల్లో ఉండి ఏం లాభమని ఆయన అన్నారు. 

వైసీపీ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడలేక సిగ్గుతో తల దించుకుంటున్నారని, భిన్నాభిప్రాయాలున్నా ఏకాభిప్రాయం తీసుకుని రావాలని ఆయన అన్నారు. డీజీపీ రాజ్యాంగబద్దంగా వ్యవహరించాలని ఆయన అన్నారు. 

తమ పార్టీ సిద్ధాంతం ఏమైనా ప్రజలకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తానని ఆయన చెప్పారు. కేంద్రం దృష్టికి తీసుకుని వెళ్లి అమరావతిలోనే రాజధాని ఉండేలా చూస్తానని ఆయన అన్నారు. రాష్ట్రంలో నేరాలు, ఘోరాలు జరుతున్నాయని అన్నారు. ఇవన్నీ చూస్తూ తాను మౌనంగా ఉండలేనని ఆయన అన్నారు. కేంద్రం కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటోందని అన్నారు. 

click me!