
అమరావతి నిర్మాణం కోసం మరోసారి భూసేకరణ చేపట్టేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ విషయమై తాజాగా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ కీలక ప్రకటన చేశారు. అమరావతి గ్రీన్‌ఫీల్డ్ రాజధాని రెండవ దశ భూసేకరణ కోసం రైతులు సుమారు 36,000 ఎకరాల భూమిని ఇచ్చేందుకు ముందుకొస్తున్నారన్నారు.
ఈ భూమిలో శంషాబాద్ విమానాశ్రయం తరహా అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌కు 5,000 ఎకరాలు, స్మార్ట్ ఇండస్ట్రీలకు 2,500 ఎకరాలు, అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటికి మరో 2,500 ఎకరాలు అవసరమవుతాయని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వానికి ఇప్పటికే 54,000 ఎకరాల భూమి బ్యాంక్ ఉంది. కానీ, ఈ భూమిని పూర్తిగా అభివృద్ధి చేయడం ఇంకా పూర్తవలేదు. ఇప్పుడు రెండవ దశలో మరో 40,000 ఎకరాల భూమి సేకరణ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇక భూమిని ఏ విధంగా సేకరించాలన్న అంశంపై ప్రభుత్వం ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదు. రైతుల అభిప్రాయం తెలుసుకునేందుకు గ్రామస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే, రైతులు భూమి పూలింగ్ పద్దతిపైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని మంత్రి చెప్పారు.
అమరావతితోపాటు మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, విజయవాడను కలిపి ఒక భారీ మెగా సిటీగా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు నారాయణ తెలిపారు.
సోమవారం జరిగిన 48వ CRDA సమావేశంలో, రూ. 3,673 కోట్ల వ్యయంతో ఐదు అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ నిర్మాణానికి తక్కువ ధర ఇచ్చిన (L1) టెండర్లు ఖరారు చేయాలని నిర్ణయించారు. ఈ టవర్స్ నిర్మాణం త్వరలోనే ప్రారంభమవుతుందని మంత్రి తెలిపారు.