
విశాఖపట్నంలో రాజకీయం వేడెక్కింది. ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రధాన పార్టీలు.. అధికార వైఎస్సార్ కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, జనసేన విశాఖ నగరంలో వేర్వేరు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ పూర్తి మద్దతుతో నాన్ పొలిటికల్ జేఏసీ నేడు విశాఖ గర్జన పిలుపునివ్వగా.. ఇందుకు కౌంటర్‌గా ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆ పార్టీ నిర్వహించే జనవాణి కార్యక్రమంలో పాల్గొనేందుకు నేడు విశాఖ చేరుకోనున్నారు. దీంతో విశాఖలో నేడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది. మూడు ప్రధాన రాజకీయ పార్టీల వేర్వేరు కార్యక్రమాలు ఉండటంతో రాష్ట్ర ప్రజలు దృష్టి మొత్తం అటువైపే ఉంది.
మూడు రాజధానులకు మద్దతుగా నాన్ పొలిటికట్ జేఏసీ పిలుపునిచ్చిన విశాఖ గర్జన మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఇందుకు అధికార వైసీపీ ఇప్పటికే మద్దతు ప్రకటించింది. ఇప్పటికే పలువురు మంత్రులు, వైసీపీ ముఖ్య నాయకులు విశాఖకు చేరుకున్నారు. మూడు రాజధానుల నినాదంతో సాగే ఈ భారీ ర్యాలీలో మంత్రులు, ఉత్తరాంధ్రకు చెందిన ప్రజలు, ఉద్యోగ సంఘాలు, ప్రొఫెసర్లు, విద్యార్థి సంఘాలు, వర్కర్స్ యూనియన్లు, వైసీపీ ప్రజాప్రతినిధులు,పాల్గొననున్నారు.
విశాఖలోని ఎల్‌ఐసీ భవనం సమీపంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి బీచ్ రోడ్డులోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వరకు దాదాపు 3.5 కిలోమీటర్ల మేర మూడు రాజధానులకు మద్దతుగా ర్యాలీ సాగనుంది. ఇందులో దాదాపు లక్ష మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. అనంతరం బహిరంగ సభ నిర్వహించనున్నారు. రాజధానుల వికేంద్రీకరణ గురించి నాన్ పొలిటికల్ జేఏసీ సభ్యులు, మంత్రులు మాట్లాడనున్నారు. నాన్ పొలిటికల్ జేఏసీ చైర్మన్, ప్రొఫెసర్ హనుమంతు లజపతి రాయ్ మాట్లాడుతూ.. విశాఖ గర్జన ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తుందని అన్నారు.
టీడీపీ రౌండ్ టేబుల్ సమావేశం..
మరోవైపు వైసీపీ బారి నుంచి ఉత్తరాంధ్రను కాపాడుదాం అనే నినాదంతో ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ నేతలు విశాఖలోని టీడీపీ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించేందుకు ఆ పార్టీ సిద్దమైంది. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన టీడీపీ నాయకులు, ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. విశాఖపట్నంను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డెస్టినేషన్‌గా చేయడంతో పాటు వ్యాపార, పారిశ్రామిక రాజధానిగా అభివృద్ధి చేయడానికి టీడీపీ ప్రభుత్వం ఏం చేసిందో ఈ సమావేశంలో వివరించనున్నట్టుగా ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. విశాఖకు చంద్రబాబు నాయుడు ఏం చేశారనే దానిపై సమగ్ర శ్వేతపత్రాన్ని సిద్ధం చేసి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని టీడీపీ భావిస్తోంది.
ఇదిలా ఉంటే.. విశాఖ గర్జన కార్యక్రమంలో టీడీపీ కార్యాలయంతో పాటు టీడీపీ కార్యకర్తలపై ఎలాంటి దాడి జరగకుండా చర్యలు ఆ పార్టీ నాయకులు పల్లా శ్రీనివాసరావు పోలీసు కమిషనర్‌ను కోరారు. విశాఖ గర్జన ర్యాలీ పేరుతో కొందరు వైసీపీ నేతలు టీడీపీ కార్యాలయంపైనా, నేతలపైనా దాడికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం ఉందని సీపీకి ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నారు.
నేడు విశాఖకు పవన్ కల్యాణ్..
ఉత్తరాంధ్ర పర్యటన నిమిత్తం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు విశాఖపట్నంకు చేరుకోనున్నారు. తన సోదరుడు పవన్ కళ్యాణ్ కార్యక్రమాల ఏర్పాట్ల కోసం సినీ నటుడు, జనసేన నాయకుడు కొణిదెల నాగబాబు శుక్రవారం వైజాగ్ చేరుకున్నారు. పవన్ కల్యాణ్ శనివారం సాయంత్రం విశాఖపట్నం చేరుకుని విమానాశ్రయం నుండి ఊరేగింపుగా బయలుదేరుతారు. ఆదివారం విశాఖపట్నంలో జనసేన నిర్వహించే జనవాణి కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించనున్నారు. ఇప్పటికే విజయవాడ, తిరుపతి తదితర ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు జరిగాయి. అయితే విశాఖలో భూకజ్జాల గురించి పవన్ కల్యాణ్ ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
భారీ బందోబస్తు..
విశాఖ గర్జన నేపథ్యంలో దాదాపు 1,100 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇందులో 15 రోప్ పార్టీలు, ఆరు ప్రత్యేక పార్టీలు, మూడు ఎపీఎస్పీ ప్లాటూన్లు ఉన్నాయి. శుక్రవారం పోలీస్ కమిషనర్ సిబ్బందికి అవగాహనా సమావేశం ఏర్పాటు చేసి ప్రజలకు అసౌకర్యం కలగకుండా శాంతియుతంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు.