
ఆళ్లగడ్డ ఎంఎల్ఏ గా రాజీనామా చేయటానికి తాను సిద్ధంగా ఉన్నట్లు భూమా అఖిలప్రియ ప్రకటించారు. రాజీనామా చేయటం ద్వారా తలెత్తే ఉపఎన్నికు సిద్దంగా ఉన్నానని మంత్రి చెప్పారు. నంద్యల ఉపఎన్నిక కౌటింగ్ లో టిడిపి దూసుకుపోతుండటం అఖిలలో ఆత్మ విశ్వాసాన్ని పెంచినట్లే కనబడుతోంది. నువ్వా నేనా అన్నట్లుగా సాగిన నంద్యాల ఎన్నికలో ఆరు రౌండ్లు పూర్తయ్యేటప్పటికి టిడిపి స్పష్టమైన ఆధిక్యతతో దూసుకుపోతోంది. ఈ నేపధ్యంలోనే మీడియాతో అఖిల మాట్లాడుతూ, ఆళ్ళగడ్డ ఎంఎల్ఏగా రాజీనామా చేసి ఉపఎన్నికకు తాను సిద్దంగా ఉన్నట్లు స్పష్టం చేసారు.
అఖిల కూడా ఫిరాయింపు ఎంఎల్ఏనే కావటం గమనార్హం. వైసీపీ నుండి టిడిపిలోకి ఫిరాయించిన 21 మంది ఎంఎల్ఏల్లో భూమా అఖిలప్రియ కూడా ఒకరన్న సంగతి తెలిసిందే. ఉపఎన్నిక జరిగిన నంద్యాల కూడా ఫిరాయింపు నియోజకవర్గమే. ఫిరాయింపు ఎంఎల్ఏలందరినీ రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లో గెలివాలంటూ వైసీపీ సవాలు చేస్తోంది ఎప్పటి నుండో. మంత్రి మాట్లాడుతూ, తాము రాజీనామాలు చేయటానికి సిద్ధంగా ఉన్నామని, కాకపోతే నిర్ణయం తీసుకోవాల్సింది చంద్రబాబునాయుడేనని మెలిక పెట్టారు.
ప్రస్తుత ఉపఎన్నికలో సెంటిమెంటు-అభివృద్ధిని చూసే తమకు ఓట్లేసినట్లు అభిప్రాయపడ్డారు. తాము ఎన్నికల్లో డబ్బులు పంచినట్లు వైసీపీ చేసిన ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ప్రజల మద్దతు తమకు పూర్తిగా ఉందని, తమమీద నమ్మకం ఉండబట్టే టిడిపికి ఓట్లు వేసారని అఖిలప్రియ చెప్పారు.