
రాజకీయాల్లో హత్యలుండవు..కేవలం ఆత్మహత్యలే ఉంటాయి..తమిళనాడులో శశికళ, టిటివి దినకరన్ వ్యవహారశైలే ఇందుకు తాజా ఉదాహరణ. శశికళ అరెస్టు, టిటివిపై లంచం కేసు నమోదు నేపధ్యంలో వేగంగా మారుతున్న పరిస్ధితులే ఇందుకు సాక్ష్యం. ఏఐఏడిఎంకె అబాసుపాలవ్వటానికి తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ అత్యాశే కారణం. జయ మరణం తర్వాత వెంటనే సిఎం పీఠంపై కూర్చోవాలన్న ఆతృతే కొంపముంచింది. పన్నీర్ సెల్వమే ముఖ్యమంత్రిగా ఉండుంటే తమిళనాడు రాజకీయాలు ఏ విధంగా ఉండేవో చెప్పలేం. అలాకాదని పన్నీర్ ను దింపేసి తాను సిఎం అయిపోవాలని శశికళ అనుకోవటమే సమస్యలకు మూలకారణమైంది.
సరే ఏ పరిస్ధితుల్లో శశికళ ఆశలు అత్యాశలయ్యాయి, పళనిస్వామి సిఎం అయిన నేపధ్యమేమిటి, ఇపుడు పన్నీర్ సెల్వం ఏం చేస్తున్నారన్నది అందరికీ తెలిసిందే. ఆర్కె నగర్ ఉప ఎన్నిక కూడా టిటివి దినకరన్ కొంప ముంచింది. ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని టిటివి తొక్కిన అడ్డదారులే ఇపుడు చిన్నమ్మతో పాటు టిటివి అరెస్టుకు మూలమైంది. దాంతో ఇద్దరినీ పార్టీ నుండి బలవంతంగానైనా బయటకు గెంటేయాలని నిర్ణయమైంది. మొన్నటి వరకూ ఉప్పు-నిప్పుగా ఉన్న సిఎం పళనిస్వామి, పన్నీర్సెల్వం వర్గాలు హటాత్తుగా ఏకమవ్వాలని నిర్ణయించుకోవటం మొత్తం ఎపిసోడ్లో లేటెస్ట్ ట్విస్టు.
శశికళ, టిటివి వల్ల పార్టీ అబాసుపాలైందని, జయలలిత పరువు మంటగలిసిందని ఇపుడు రెండు వర్గాలు శశికళ, టిటివిలపై మండిపడుతున్నాయి. అందుకనే వీరిద్దరినీ పార్టీ నుండి తరిమేయాలని నిర్ణయించుకున్నాయి. రెండు వర్గాలు కలిస్తే, సిఎంగా పళనిస్వామే కొనసాగటం, పార్టీ పగ్గాలు పన్నీర్ సెల్వంకు అప్పగించాలనే ఒప్పందానికి వచ్చినట్లు ప్రచారం సాగుతోంది. ఇరువర్గాలకు చెందిన ఎంఎల్ఏలు సోమవారం అర్ధరాత్రి విడివిడిగానే సమావేశమయ్యాయి. మంగళవారం జాయింట్ సమావేశం నిర్వహించాలని రెండు వైపుల నుండి ప్రతిపాదనలు వెలుగు చూసున్నాయ్.
పళని కూడా శశికళ, టిటివిలతో విసిగిపోయినట్లు సమాచారం. తమిళనాడుకు సిఎం పళనిస్వామే కానీ డ్రైవింగ్ మొత్తం అత్తా, మేనల్లుళ్ళదేనన్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రతీ విషయంలోనూ టిటివిదే అంతిమ నిర్ణయం. దినకరన్ ఆమోదించిన ఫైళ్ళపైనే సిఎం సంతకాలు పెట్టాలట. పై ఇద్దరి వ్యవహారశైలితో విసిగిపోయిన సిఎంకు పార్టీ గుర్తు కోసం దినకరన్ ఒక బ్రోకర్ కు రూ. 60 కోట్లతో డీల్ కుదుర్చుకున్నారన్న వార్త నెత్తిన పాలుపోసినట్లైంది. అందుకే మధ్యవర్తుల ద్వారా వెంటనే పన్నీర్ కు కబురుపెట్టారు. దానికితోడు టిటివిపై నాన్ బైలబుల్ కేసు నమోదవ్వటం ఈరోజు అరెస్టు చేస్తారనే ప్రచారం ఊపందుకోవటంతో మన్నార్ గుడి మాఫియాను పార్టీ నుండి పూర్తిగా తరమేయాలని రెండు వర్గాలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం.