
తెలుగదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించిన ఆ పార్టీ అధికార ప్రతినిధి, సినీ నటి దివ్య వాణి.. భావోద్వేగానికి గురయ్యారు. మీడియాతో మాట్లాడుతూ ఆమె కన్నీరు పెట్టుకున్నారు. దివ్యవాణి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు విజన్ గల నాయకుడని.. అందుకే టీడీపీలో చేరానని దివ్యవాణి అన్నారు. నేర్చుకోవాలని ఉద్దేశంతో.. మంచి నాయకుడి అధ్యక్షతన పనిచేయాలని టీడీపీలో చేరానని చెప్పారు. గత ఏడాది కాలంగా తనకు ఎందుకు ప్రాముఖ్యత ఇవ్వడం లేదో తెలియని పరిస్థితుల్లో పార్టీలో పనిచేశానని చెప్పారు.
పార్టీ బాగుండాలనే తాను తాపత్రాయ పడ్డానని చెప్పారు. తాను నిజాలనే చంద్రబాబు దగ్గరకే తీసుకెళ్లానని తెలిపారు. ఒక వ్యక్తి గురించి.. వ్యవస్థను ఎలా అంటారని ప్రశ్నించడం జరిగిందని తెలిపారు. తాను ప్రభువు కోసం బుతుకుతున్నానని చెప్పారు. చంద్రబాబు మంచి విజన్ ఉన్న నాయకులు.. ఎప్పుడైనా ఇదే చెబుతానని అన్నారు. చంద్రబాబును కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. మతమార్పిడి గురించి చంద్రబాబు ఏదో మాట్లాడారని అన్నారు.
నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే పార్టీలో చేరానని తెలిపారు. తనకు ప్రాముఖ్యత తగ్గిందని.. అది గుర్తించడానికి సమయం పట్టిందని చెప్పారు. ప్యాకేజ్ అందింది.. అందుకే రాజీనామా చేయడం లేదని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరి నిమిషం వరకు క్లారిటీ తీసుకునేందుకే ఆగానని చెప్పారు. తాను ఎప్పుడూ భజన చేయనని చెప్పారు. ఎవరూ చెప్పని నిజాలు చెబుతున్నానని అందరూ ప్రశంసించారని తెలిపారు. కొందరు ఇడియట్స్ జర్నలిజం పేరుతో నానా మాటలు అన్నారని విరమర్శించారు. ఇలాంటి రోజు వస్తుందని భావించలేదని చెప్పారు.
Also Read: టీడీపీకి రాజీనామా చేస్తున్నాను.. లోపల ఏం జరిగిందో చెబుతాను: వీడియో విడుదల చేసిన దివ్యవాణి
నాటకీయ పరిణామాలు..
దివ్యవాణి 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు టీడీపీలో చేరారు. టీడీపీలో యాక్టివ్‌గా ఉంటున్న దివ్యవాణి.. ప్రత్యర్థులపై తనదైన శైలిలో విరుచుకుపడుతుంటారు. టీడీపీపై వైసీపీ మహిళా నేతలు చేసే వ్యాఖ్యలపై ఆమె ఎదురుదాడి చేస్తుంటారు. టీడీపీ కార్యక్రమాల్లో కూడా ఆమె చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే ఇటీవల ఎన్టీఆర్ జయంతి వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద కూడా ఆమె నివాళులర్పించారు. ఆ సమయంలో కూడా టీడీపీ గురించి ఆమె గొప్పగా మాట్లాడారు.
అయితే ఒంగోలులో జరిగిన మహానాడు తర్వాత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన దివ్యవాణి.. తనకు అవమానం జరిగిందని ఆరోపించారు. పార్టీ తీరుపై సంచలన కామెంట్ చేశారు. ఈ క్రమంలోనే మే 31న పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా ట్వీట్ చేశారు. టీడీపీలో కొన్ని దుష్ట శక్తుల ప్రమేయాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా చేస్తున్నట్టుగా దివ్యవాణి చెప్పారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్‌లో ఓ పోస్టు చేశారు. ఇంతవరకు నన్ను ఆదరించిన ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతున్నట్టుగా చెప్పారు. తర్వాత కొద్దిసేపటికే ఆ ట్వీట్‌ను దివ్యవాణి డిలీట్ చేశారు. తనను సస్పెండ్ చేసినట్లు వచ్చిన నకిలీ పోస్టు చూసి పొరపడి ట్వీట్ పెట్టానని దివ్యవాణి తెలిపారు. తాను టీడీపీలోనే ఉంటున్నాననే సంకేతాలు పంపారు. ఈ క్రమంలోనే ఆమె బుధవారం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీలో తనకు జరిగిన అవమానాలను, ఇబ్బందులను ఆయనకు ఆమె వివరించారు.
చంద్రబాబుతో భేటీ ముగిసిన అనంతరం దివ్యవాణి మీడియాతో మాట్లాడుతూ.. తనపై విమర్శలు, విశ్లేషణలు చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయం తెలియదని విమర్శించిన వారికి కూడా కృతజ్ఞతలు చెప్పారు. తనను సస్పెండ్ చేసినట్లు వచ్చిన నకిలీ పోస్టు చూసి పొరబడి ట్వీట్ పెట్టానని.. తప్పుడు ప్రచారాలకు తొందరపడొద్దని చంద్రబాబు సూచించారని దివ్యవాణి తెలిపారు. పార్టీలో ఇబ్బందులను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లానని.. టీడీపీలో చేరిన నాటి నుంచి తన వంతు కృషి చేశానని ఆమె వెల్లడించారు. అయితే కొద్ది గంటల్లోనే ఏం జరిగిందో తెలియదు గానీ.. తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టుగా దివ్యవాణి ఓ వీడియో విడుదల చేశారు.