తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గుంటూరు బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడించారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గుంటూరు బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. ఈ రోజు జరిగిన రమ్య హత్యా ఘటన అత్యంత దురదృష్టకరమన్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితున్ని గుర్తించామని గౌతం సవాంగ్ తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో స్థానికులు అత్యంత కీలక సమాచారాన్ని పోలీసులకు అందించారని ఆయన తెలిపారు. హత్యకు పాల్పడిన యువకుడిని గుంటూరు అర్బన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని.. నిందుతుణ్ణి కఠినంగా శిక్షిస్తామని గౌతం సవాంగ్ స్పష్టం చేశారు. సోషల్ మీడియా పరిచయాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని డీజీపీ హెచ్చరించారు. యువతులు, మహిళలపై దాడులకు యత్నిస్తే కఠిన శిక్షలు తప్పవన్నారు.
జరిగిన ప్రతి సంఘటనను రాజకీయ కోణంలో చూడవద్దని గౌతం సవాంగ్ హితవు పలికారు. సమాజంలో జరుగుతున్న వికృత పోకడలను సమిష్టిగా ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఘటన జరిగిన తక్షణం వేగంగా స్పందించి కేసు ను ఛేదించిన గుంటూరు అర్బన్ పోలీసులను డీజీపీ అభినందించారు. దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేసి నిందితుడికి సత్వరం కఠిన శిక్ష పడేలా చూడాలని ఆదేశాలు ఇచ్చామని గౌతం సవాంగ్ తెలిపారు. మహిళల రక్షణ తమ ప్రథమ కర్తవ్యమన్న డీజీపీ.. ఇందుకోసమై అహర్నిశలు శ్రమిస్తామని స్పష్టం చేశారు.
Also Read:గుంటూరులో దారుణం: బీటెక్ విద్యార్ధిని రమ్య హత్య
కాగా, గుంటూరు జిల్లా పెదకాకాని రోడ్డులో బీటెక్ థర్డ్ ఈయర్ విద్యార్ధిని రమ్య హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. రమ్యను గుర్తుతెలియని దుండగుడు కత్తితో పొడిచి చంపాడు. మెడ కింది భాగంలో పొట్టపై విచక్షణరహితంగా కత్తితో పొడిచాడు. ఈ ఘటనలో యువతికి తీవ్రంగా రక్తస్రావమై అక్కడికక్కడే మరణించింది. యువతిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించిందని వైద్యులు తెలిపారు.
పెదకాకాని రోడ్డులోని ఓ టిఫిన్ సెంటర్ వద్ద టిఫిన్ తీసుకొచ్చేందుకు గాను రమ్య వచ్చింది. ఆ సమయంలో ఓ యువకుడు టిఫిన్ సెంటర్ వద్దకు వచ్చి ఆమెను బైక్ పై కూర్చోవాలని కోరాడు.అయితే యువతి నిరాకరించింది.దీంతో ఆ యువకుడు తన వెంట తెచ్చుకొన్న కత్తితో ఆ యువతిని కత్తితో పొడిచాడు. ఈ ఘటన ఇంటికి సమీపంలో చోటు చేసుకొంది.