టీచర్లకు వ్యాక్సినేషన్ పూర్తయ్యాకే స్కూల్స్ తెరవాలని ఏపీ హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణ చేసింది. గురువారం నాడు ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించింది హైకోర్టు. ఉపాధ్యాయులకు 85 శాతం వ్యాక్సినేషన్ పూర్తైందని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.
అమరావతి: ఉపాధ్యాయులకు 85 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేశామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.మిగిలినవారికి కూడ వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానానికి తెలిపింది.
ఈ విషయమై అఫిడవిట్ దాఖలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టును మరింత సమయం ఇవ్వాలని కోరారు.ఈ పిటిషన్ పై విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.
ఈ నెల 16వ తేదీ నుండి ఏపీలో విద్యా సంస్థలను తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. స్కూల్స్, కాలేజీలను తెరవనున్నారు. ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు గత నెల 12 నుండి ఆన్‌లైన్ లో క్లాసులు నిర్వహిస్తున్నారు.ఈ నెల 16 నుండి కాలేజీల్లో నేరుగా ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తారు.
రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినందున విద్యా సంస్థలను తిరిగి తెరవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఇప్పటికే రెండేళ్లుగా కరోనా కారణంగా విద్యార్థులు ఇంటికే పరిమితమయ్యారు. గత విద్యాసంవత్సరంలో టెన్త్, ఇంటర్ పరీక్షలను కూడా నిర్వహించకుండా రద్దు చేశారు.