ఏపీలో వెల్లివిరిసిన ఓటర్ చైతన్యం ... ఏకంగా 81.66 శాతం పోలింగ్

By Arun Kumar PFirst Published May 15, 2024, 3:24 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో రికార్డ్ పోలింగ్ శాతం నమోదయ్యింది. గత రెండు ఎన్నికల రికార్డును ఈ ఎన్నికల ద్వారా ఓటర్లు బద్దలుగొట్టారు. ఇంతకూ ఎంతశాతం పోలింగ్ నమోదయ్యిందో తెలుసా..?  

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో లోక్ సభతో పాటే అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. మే 13న పోలింగ్ ముగిసింది... ఇక ఓట్లు లెక్కింపు ఒక్కటే మిగిలిపోయింది. అయితే ఈసారి రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ నమోదయ్యింది. ఓటు వేసేందుకు ప్రజలు అర్ధరాత్రి 2గంటల వరకు పోలింగ్ కేంద్రాల వద్ద వున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు భారీగా పోలింగ్ నమోదయ్యిందని. ఈ ఎన్నికల్లో 80.66 శాతం పోలింగ్ జరిగినట్లు రాాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రకటించారు. పోస్టల్ బ్యాలెట్స్ తో కలుపుకుంటే ఈ పోలింగ్ శాతం 81.66 కు చేరుకుంటుంది.

గత సోమవారం అంటే మే 13న పోలింగ్ జరిగినా పోలింగ్ శాతం ప్రకటించేందుకు ఈసి టైమ్ తీసుకుంది. పోలింగ్ ఆలస్యం కావడంతో క్షేత్రస్థాయి నుండి సమాచారం కూడా ఈసీకి ఆలస్యంగా వచ్చింది. ఇలా పూర్తి సమాచారం అందినతర్వాత దాన్ని ఎలక్షన్ కమీషన్ అధికారులు పరిశీలించారు. నిన్న(మంగళవారం) మొత్తం ఈ ప్రక్రియ కొనసాగింది. ఇక ఇవాళ(బుధవారం) పోలింగ్ శాతంపై క్లారిటీ వచ్చేసింది. 

Latest Videos

ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యేక ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన మూడో ఎన్నిక ఇది. అయితే ఎన్నిక ఎన్నికకూ ఓటర్లలో చైతన్యం మరింత పెరుగుతోంది.  దీంతో ప్రతిసారీ పోలింగ్ శాతం పెరుగుతూ వస్తోంది. 2014 లో జరిగిన మొదటి ఎన్నికల్లో 78.41, రెండోసారి 2019లో 79.64 శాతం పమోదయితే ఈసారి ఏకంగా 81.66 శాతం పోలింగ్ నమోదయ్యింది. 

సాయంత్రం ఆరు గంటల వరకు కూడా 3500 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్నారని సీఈవో మీనా తెలిపారు.   అర్ధరాత్రి 2 గంటలకు చివరి పోలింగ్ స్టేషన్ లో పోలింగ్ ముగిసిందని ఆయన తెలిపారు. అక్కడక్కడా చిన్నచిన్న గొడవలు, కొన్నిచోట్ల వర్షం కారణంగా పోలింగ్ అంతరాయం ఏర్పడిందన్నారు. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రశాంతంగా పోలింగ్ ముగిసినట్లు సీఈవో తెలిపారు. 

నియోజకవర్గాలవారిగా పోలింగ్ శాతం పరిశీలిస్తే అత్యధికంగా దర్శిలో 90.91 శాతం నమోదైనట్లు సీఈవో మీనా తెలిపారు. అత్యల్పంగా తిరుపతిలో 63.32 శాతం నమోదయ్యింది. లోక్ సభ ఎన్నికల విషయానికి వస్తే అత్యధికంగా ఒంగోలులో 87.06 శాతం, అత్యల్పంగా విశాఖలో 71.11 శాతం  పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారి మీనా ప్రకటించారు. 

 
  
 

   
 

click me!