పిఠాపురంలో భారీగా పెరిగిన పోలింగ్ … ఎవరికి లాభం ? 

By Arun Kumar PFirst Published May 15, 2024, 11:14 AM IST
Highlights

పిఠాపురంలో  గెలుపెవరిది? పెరిగిన ఓటింగ్ శాతంతో ఎవరికి లాభం ? అనే చర్చ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో జనసేన, వైసిపి ల వాదన ఎలా వుందంటే...

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో ఏ ఎన్నికలు  జరిగినా ప్రధానంగా కుప్పం, పులివెందుల పేరు వినిపిస్తుంది. మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు ఇక్కడి నుండి ప్రాతినిధ్యం వహిస్తుండటమే ఆ నియోజకవర్గాలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. తాజాగా ఇలాంటి ప్రత్యేకత కలికిన నియోజకవర్గాల జాబితాలోకి పిఠాపురం చేరిపోయింది. ఇంకా చెప్పాలంటే ఈసారి ఎన్నికల్లో పిఠాపురమే హాట్ టాపిక్ గా మారింది. జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఇక్కడి నుండి పోటీ చేస్తుండటమే ఇందుకు కారణం. 

పిఠాపురంలో పెరిగిన పోలింగ్ శాతం :  

Latest Videos

కాకినాడ జిల్లాలోని  పిఠాపురం నియోజకవర్గంలో కాపు సామాజికవర్గం అధికంగా వుంటుంది. దీంతో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఈ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. గతంలో తన పాపులారిటీ గెలిపించలేకపోయింది కాబట్టి ఈసారి తన సామాజికవర్గాన్ని నమ్ముకున్నారు పవన్. తాను రాష్ట్రవ్యాప్తంగా కూటమి అభ్యర్థులకు ప్రచారం చేస్తూనే తాను పోటీచేసే పిఠాపురంలో ప్రచారంపైనా ప్రత్యేక శ్రద్ద చూపించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా రిజల్ట్ బెడిసికొట్టకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. 

ఇక పవన్ కల్యాణ్ కోసం తెలుగు సినీతారలు పిఠాపురం బాట పట్టారు. ఒక్క చిరంజీవి తప్ప మెగా కుటుంబమంతా పిఠాపురం ప్రచారంలో పాల్గొన్నారు. ముందునుండే నాగబాబు దంపతులు, వారి తనయుడు వరుణ్ తేజ్  ప్రచారం చేపట్టగా చివర్లో రాంచరణ్ తల్లి సురేఖతో కలిసి బాబాయ్ కి మద్దతుగా పిఠాపురం వెళ్లారు. ఇక కొందరు సినిమావాళ్లు పిఠాపురంలోనే వుంటూ జనసైనికులతో కలిసి ప్రచారం చేపట్టగా మరికొందరు సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల ద్వారా ప్రచారం చేపట్టారు.  ఇక జనసేన, టిడిపి నాయకులు కూడా ముమ్మరంగా ప్రచారం చేపట్టారు.  

మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా పిఠాపురం నియోజకవర్గాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. పవన్ పై పోటీచేస్తున్న అభ్యర్థి వంగా గీతకు కావాల్సిన సహకారం అందించింది వైసిపి అధిష్టానం. ఆమె కూడా పిఠాపురంలో ముమ్మర ప్రచారం నిర్వహించారు. 

ఇలా అధికార పార్టీ, ప్రతిపక్ష కూటమి, సినిమా వాళ్ళ ప్రచారంతో పిఠాపురం ఓటర్లు కదిలారు. దీంతో పిఠాపురం అసెంబ్లీలో ఏకంగా 86 శాతం పోలింగ్ నమోదయ్యింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే పిఠాపురంలో 80 పోలింగ్ నమోదయ్యింది. అంతకు ముందు 2014 అయితే 79 శాతమే. ఈసారి పోలింగ్ శాతం ఏకంగా 6 శాతం పెరగడంతో ఇది ఎవరికి అనుకూలంగా మారుతుందన్న చర్చ మొదలయ్యింది. ఎవరికి వారు పెరిగిన పోలింగ్ తమకే లాభం చేస్తుందన్న ధీమాతో వున్నాయి. 

జనసేన వాదన : 

పిఠాపురంలో హైవోల్టేజ్ రాజకీయాల నేపథ్యంలో ప్రతి ఓటూ కౌంట్ అవుతుంది. అలాంటిది గత ఎన్నికలతో పోలిస్తే ఏకంగా ఆరుశాతం ఎక్కువగా ఓట్లు పోలయ్యాయి. ఇందుకు కారణం పవన్ కల్యాణ్ పోటీలో వుండటమేనని జనసేన నాయకులు అంటున్నారు. ఈ పెరిగిన ఓట్లు కూడా తమకే లాభం చేస్తాయన్న నమ్మకంతో వున్నారు. ఈసారి పవన్ గెలుపు ఖాయమని అంటున్నారు. 

పవన్ కల్యాణ్ సోదరుడు, జనసేన నాయకుడు నాగబాబు అయితే మరో అడుగు ముందుకేసి పిఠాపురం ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. పిఠాపురంలో గెలుపు పక్కా... మెజారిటీ ఎంతన్నదే  మ్యాటర్ అని ఆయన అంటున్నారు. టిడిపి నేత వర్మ కూడా  పవన్ గెలిచి తీరతాడని అంటున్నారు. పవన్ కల్యాణ్ కోసమే ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాలను తరలివచ్చారని ... ఆయనను గెలిపించాలన్న తపన వారిలో కనిపించిందన్నారు. పిఠాపురం నుండి గెలిచే పవన్ కూటమి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించనున్నారని స్థానిక జనసేన నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

వైసిపి వాదన : 

పిఠాపురంలో ఓటింగ్ శాతం పెరగడంపై వైసిపి వాదన మరోలా వుంది. పిఠాపురం ప్రజలు వంగా గీతకు మద్దతుగా వున్నారని ... ఆమెను గెలిపించేందుకే పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలినట్లు చెబుతున్నారు. కేవలం నియోజకవర్గం మారిందంతే... పవన్ కు ఈ ఎన్నికల్లోనూ 2019 ఫలితమే రిపీట్ అవుతుందని అంటున్నారు. పిఠాపురంలో వంగా గీత, రాష్ట్రంలో వైసిపి గెలుపు ఖాయమని అభిప్రాయపడుతున్నారు. 

గత ఐదేళ్లలో జగన్ సర్కార్ చేసిన అభివృద్ది, ప్రజా సంక్షేమ పాలనే వైసిపిని గెలిపిస్తాయన్న ధీమాను వైసిపి నాయకులు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో పోలింగ్ శాతం పెరగడానికి ఇదికూడా ఓ కారణమని అంటున్నారు. 

click me!