టెన్త్ ఎగ్జామ్ పేపర్ లీక్స్, మాస్ కాపీయింగ్ పై విద్యాశాఖ సీరియస్... 42మంది టీచర్లు అరెస్ట్, సస్పెండ్

Arun Kumar P   | Asianet News
Published : May 03, 2022, 09:43 AM IST
టెన్త్ ఎగ్జామ్ పేపర్ లీక్స్, మాస్ కాపీయింగ్ పై విద్యాశాఖ సీరియస్... 42మంది టీచర్లు అరెస్ట్, సస్పెండ్

సారాంశం

ఏపీలో జరుగుతున్న పదో తరగతి పరీక్షల్లో పేపర్ లీక్స్, మాస్ కాపీయింగ్ కలకలం రేపుతోంది. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న విద్యాశాఖ 42మంది టీచర్లను అరెస్ట్ చేసింది. 

విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు ప్రారంభమైంది మొదలు పేపర్స్ లీక్, మాస్ కాపీయింగ్ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాస్ కాపీయింగ్ కలకలం రేపింది. పామర్రు మండలం పసమర్రు జిల్లా పరిషత్ పాఠశాల నుంచి పదో తరగతి పరీక్షకు సంబంధించిన సమాధానాల స్లిప్‌లను పరీక్షా కేంద్రానికి పంపుతున్నట్లు ఫిర్యాదులు అందాయి. దీంతో విద్యాశాఖ అధికారులు, పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కొందరు ఉపాధ్యాయుల వద్ద సెల్​ఫోన్‌లో సమాధానాలను గుర్తించారు. 

ఈ మాస్ కాపీయింగ్ ఘటనపై విద్యాశాఖ అధికారులు సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు సిద్దమయ్యారు. ఇప్పటికే డీఈవో తాహిరా సుల్తానా ఎగ్జామినేషన్ సెంటర్ కు చేరుకుని విచారణ చేపట్టారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న డీఈఓ తెలిపారు.  

ఇక ఇప్పటికే  పదో తరగతి పరీక్షల్లో పేపర్ లీక్‌ ఘటనలపై ప్రభుత్వం సీరియస్ గా వుంది. పరీక్షలు మొదలైనప్పటి నుండి వరుస ఘటనలు చోటుచేసుకున్న ఘటనలపై విద్యాశాఖతో పాటు పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఇప్పటివరకు 42 మంది ఉపాధ్యాయులను అరెస్టు చేసారు. అరెస్టయిన ఉపాధ్యాయులను ఇప్పటికే ప్రభుత్వం సస్పెండ్ చేసింది. 

ఇకపైనా ఇలాగే కఠినంగా వ్యవహరించనున్నట్లు విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులను హెచ్చరించారు. పేపర్ లీక్ కాదు మాల్ ప్రాక్టీస్‌ కు పాల్పడినా  కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడ్డారని రుజువైతే సర్వీస్ నుంచి తొలగించాలనే యోచనలో విద్యాశాఖ వున్నట్లు సమాచారం. 

ఏపీలో పదో తరగతి పరీక్షలు గత బుధవారం ప్రారంభమవగా మొదటిరోజే తెలుగు పేపర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. అయితే ఇది పేపర్ లీక్ కాదని... మాల్ ప్రాక్టీస్ అని విద్యాశాఖ పేర్కొంది.  అయితే నంద్యాల జిల్లాలో 12 మందిని అరెస్ట్ చేయగా.. చిత్తూరు జిల్లాలో పదో తరగతి తెలుగు ప్రశ్నపత్రం బయటకు వచ్చిన ఘటనలో నారాయణ విద్యాసంస్థల వైస్‌ ప్రిన్సిపాల్‌ గిరిధర్‌, ఎన్‌ఆర్‌ఐ స్కూల్‌ ప్రిన్సిపాల్‌‌ సుధాకర్‌లను అదుపులోకి తీసుకున్నారు. 

ఇక శ్రీకాకుళం జిల్లాలో హిందీ పేపర్ లీకేజీ అయినట్టుగా ప్రచారం జరిగింది. సరుబుజ్జిలి మండలంలోని రొట్ట వలస, సలంత్రీ పరీక్షా కేంద్రాల నుంచి హిందీ పేపర్ బయటకు వచ్చిందని ప్రచారం జరగడంతో.. కలెక్టర్ బి లఠ్కర్ వెంటనే విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లా విద్యాశాఖ అధికారి పగడాలమ్మ రొట్టవలస పరీక్షా కేంద్రానికి వచ్చి అధికారులను ఆరా తీశారు. పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని.. లీకేజీ వందతుల్లో వాస్తవం లేదని అన్నారు. 

ఇక నందికొట్కూరు‌లో ఇంగ్లీష్ పేపర్ లీక్ అయినట్టుగా వార్తలు వచ్చాయి. గాంధీ మెమోరియల్ హైస్కూల్ నుంచి ఇంగ్లీష్ పేపర్ లీక్ అయింది. అటెండర్ ద్వారా పేపర్ లీక్ అయినట్టుగా ప్రచారం సాగింది.  దీంతో అప్రమత్తమైన కర్నూలు, నంద్యాల డీఈవోలు విచారణ చేపట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా గాండల్లపెంటలో ఇంగ్లీష్ ప్రశ్నపత్రం లీక్ అయినట్టుగా అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు నల్లచెరువు ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్‌ విజయ్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. 


 

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu