పెళ్లి కోసం అరటి గెల కోస్తుండగా..కాటేసిన కరెంట్: నలుగురి మృతి

By Siva KodatiFirst Published Feb 4, 2019, 12:44 PM IST
Highlights

అధికారుల నిర్లక్ష్యం రెండు కుటుంబాల్లో ఆరని చిచ్చు రేపింది. పెళ్లి పనుల కోసం అరటి గెల కోస్తుండగా కరెంట్ షాక్‌తో నలుగురు మరణించడంతో రెండు కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంది.

అధికారుల నిర్లక్ష్యం రెండు కుటుంబాల్లో ఆరని చిచ్చు రేపింది. పెళ్లి పనుల కోసం అరటి గెల కోస్తుండగా కరెంట్ షాక్‌తో నలుగురు మరణించడంతో రెండు కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం కొత్తరౌతుపేట గ్రామానికి చెందిన వెంకన్న కుమారుడు శ్రీనుకు, రాయిలింగారిపేట గ్రామానికి చెందిన గొర్లె పాపినాయుడు కుమార్తె కళ్యాణితో మార్చి 27న పెళ్లి చేయాలని నిర్ణయించారు.

ఈ క్రమంలో ఈ నెల 6వ తేదీన పెళ్లి పనులు ప్రారంభానికి సూచనగా పసుపు దంచడం కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. శుభకార్యం కావడంతో అరటిపళ్లు గెలలు తేవడానికి వెంకన్న... కొత్తరౌతుపేటలో ఉంటున్న తన బావ ఆబోతుల రాముడు అరటి తోటకు ఇద్దరు కలిసి వెళ్లారు.

అరటి గెలలు కోస్తుండగా కిందకు వేలాడి ఉన్న విద్యుత్ తీగలు గమనించకపోవడంతో ఇద్దరూ కరెంట్ షాక్‌తో అక్కడికక్కడే మరణించారు. ఎంతసేపు గడుస్తున్నా ఇద్దరూ తోట నుంచి తిరిగి రాకపోవడంతో ఆ పక్కనే ఉన్న రాముడు భార్య పుణ్యవతి, కొత్తరౌతుపేటకు చెందిన బంగారమ్మలు కలిసి తోటలోకి వెళ్లారు.

కింద స్పృహతప్పి పడివున్న వీరిని పైకి లేపేందుకు ప్రయత్నించగా వారికి కూడా విద్యుత్ షాక్ తగిలింది. దీంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. షాక్ తీవ్రతకు నలుగురి శరీర భాగాలు కాలిపోయాయి.

తోటలో ఎవ్వరూ లేకపోవడంతో వీరు మరణించిన విషయం సాయంత్రం వరకు బయటకు తెలియలేదు. కొద్దిసేపటి తర్వాత వెంకన్న కుమారుడు, పెళ్లి కొడుకు శ్రీను, మరో ఇద్దరితో కలిసి తోటకు వచ్చి చూడగా నలుగురు చనిపోయి వున్నారు.

వెంటనే అధికారులకు, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఆర్డీవో, డీఎస్పీ, ఎంఆర్‌వో ఇతర అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదంపై విచారణకు ఆదేశించిన ఆర్డీవో.. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల నష్టపరిహారం చెల్లిస్తామని తెలిపారు.

నలుగురి మరణం రెండు గ్రామాల్లో, రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. కాబోయే మామగారు మరణించడంతో పెళ్లి కుమార్తె కల్యాణి కన్నీరుమున్నీరుగా విలపించింది. జరిగిన ప్రమాదంలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం లేదని ఆ శాఖ శ్రీకాకుళం డివిజనల్ ఇంజనీర్ తెలిపారు.

ఆ గ్రామంలో కొంతకాలం క్రితమే ఎల్‌టీ లైన్‌ సరఫరాను పూర్తిగా నిలిపివేశామన్నారు.  అయితే మృతులు అరటి గెలను కొడుతుండగా, అప్పటికే డెడ్ అయిన ఎల్‌టీ విద్యుత్ లైన్‌పై ఆ గెల తెగిపడిందన్నారు.

చెట్టుతో కూడిన అరటి చెట్టు బరువు ఒక్కసారిగా ఆ లైన్‌పై పడిందని, దీంతో ఎల్‌టీ లైన్ చివరి భాగం పైకి వచ్చి, దగ్గరలోనే ఉన్న 11 కేవీ లైన్‌ను తాకిందని వివరించారు. ఆ వెంటనే సరఫరాలో ఉన్న 11 కేవీ లైన్ కనెక్ట్ కావడంతో అరటి చెట్టును తాకడంతోనే ప్రమాదం జరిగిందని ఆయన తెలిపారు. 
 

click me!