పల్నాడులో ఘోర రోడ్డుప్రమాదం... లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్... ఒకరు మృతి, 20మందికి గాయాలు

Arun Kumar P   | Asianet News
Published : Apr 24, 2022, 07:54 AM ISTUpdated : Apr 24, 2022, 08:09 AM IST
పల్నాడులో ఘోర రోడ్డుప్రమాదం... లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్... ఒకరు మృతి, 20మందికి గాయాలు

సారాంశం

అతివేగంతో వెళుతున్న ట్రావెల్స్ బస్సు రోడ్డుపక్కన ఆగివున్న లారీని ఢీకొట్టడంతో ఒకరు మృతిచెందడంతో పాటు 20 మంది గాయపడిన దుర్ఘటన పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది. 

గుంటూరు: పల్నాడు జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపక్కన ఆగివున్న లారీని అతివేగంతో దూసుకెళుతున్న ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు క్లీనర్ అక్కడికక్కడే మృతిచెందగా డ్రైవర్ తో  సహా 20మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.  

వివరాల్లోకి వెళితే... శనివారం రాత్రి తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుండి ఏఎస్ పేటకు జగన్ ట్రావెల్స్ బస్సు ప్రయాణికులతో బయలుదేరింది. తెల్లవారుజామున బస్సు పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గ పరిధిలో ప్రయాణిస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. దాచేపల్లి పట్టణంలోని అద్దంకి-నార్కట్ పల్లి హైవే పక్కన ఆగివున్న లారీని బస్సు ఢీకొట్టింది.  

అతివేగంతో వెళుతూ లారీ వెనకబాగాన్ని బలంగా ఢీకొట్టడంతో నిద్రలో వున్న ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. డ్రైవర్ పక్కసీట్లో వున్న క్లీనర్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. వీరితోపాటు బస్సులోని 20మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. 

ట్రావెల్స్ బస్ యాక్సిడెంట్ పై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని స్థానికులు సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. ముందుగా గాయపడిన ప్రయాణికులను దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించిన చికిత్స అందేలా చూసారు. అనంతరం బస్ క్లీనర్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

బస్ డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. దాచేపల్లిలో ప్రమాదానికి ముందే దామచర్ల దగ్గర అతివేగంగా వెళుతూ మరో బస్సును ఓవర్ టేక్ చేయబోగా వద్దని ప్రయాణికులు వారించగా డ్రైవర్ వెనక్కితగ్గినట్లు తెలిపారు. ఈ ఘటన తర్వాత కూడా డ్రైవర్ అదే నిర్లక్ష్యంతో డ్రైవింగ్ కొనసాగించగా 25 కిలోమీటర్లు దాటిన తర్వాత దాచేపల్లిలో ప్రమాదం జరిగింది.  

ఇదిలావుంటే గత ఆదివారం కూడా ఇలాగే ఎన్టీఆర్ జిల్లాలోనూ ఓ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురయ్యింది.  విశాఖపట్నం నుండి హైదరాబాద్ 40మంది ప్రయాణికులతో వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి రోడ్డుమధ్యలోని డివైడర్ పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్సులోని 15మంది గాయపడ్డారు. 

 విశాఖపట్నంలో 40మంది ప్రయాణికులతో బయలుదేరిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రాత్రంతా తెల్లవారుజాము వరకు ఎన్టీఆర్ జిల్లాకు చేరుకుంది. మరో మూడు నాలుగు గంటల్లో గమ్యస్థానానికి చేరుకుంటామని భావించిన ప్రయాణికులు హాయిగా నిద్రిస్తుండగా ఒక్కసారిగా బస్సు ప్రమాదానికి గురయ్యింది.  

కంచికచర్ల మండలంలోని పరిటాల బైపాస్ పై ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి బస్సు ప్రమాదానికి గురయ్యింది. లారీని ఢీకొట్టి ముందుకు దూసుకెళ్లిన బస్సు డివైడర్ ను ఢీకొట్టి ఆగింది.  దీంతో బస్సులో నిద్రిస్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.  40మంది ప్రయాణికుల్లో 15మంది గాయపడగా ఓ ముగ్గురు మాత్రం చాలా తీవ్రంగా గాయపడ్డారు.  

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!