పోలీసులు సెక్యూరిటీ ఇవ్వడం లేదు.. నాకు ఏమైనా జరిగితే: వివేకా కేసులో అప్రూవర్ దస్తగిరి వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Apr 23, 2022, 08:34 PM IST
పోలీసులు సెక్యూరిటీ ఇవ్వడం లేదు.. నాకు ఏమైనా జరిగితే: వివేకా కేసులో అప్రూవర్ దస్తగిరి వ్యాఖ్యలు

సారాంశం

తనకు పోలీసులు భద్రత కల్పించడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ వివేకా కేసులో అప్రూవర్ దస్తగిరి. పోలీసులు వారికి ఇష్టం వ‌చ్చిన‌ప్పుడు వ‌స్తున్నారు.. వెళుతున్నారని ఆరోపించాడు. తన ఇంటి వద్ద ఎవరూ పహారా కాయడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. 

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి (ys viveka murder case)  హ‌త్య కేసులో అప్రూవ‌ర్‌గా మారిన ద‌స్త‌గిరి (dastagiri) సంచలన వ్యాఖ్యలు చేశారు. త‌న భ‌ద్ర‌త‌కు సంబంధించి ఆయన తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. సీబీఐ అధికారుల సిఫార‌సు మేర‌కు కోర్టు తనకు పోలీసు సెక్యూరిటీ క‌ల్పించమని ఆదేశించినా, తన ఇంటివద్ద మాత్రం ఎవరూ పహారా కాయడం లేదని దస్తగిరి ఆరోపించారు. 

తనకు ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వ‌డం లేదని... తన సెక్యూరిటీ కోసం లోక‌ల్ పోలీసుల‌ను ఇచ్చారని చెప్పాడు. ఆ లోకల్ పోలీసులు వారికి ఇష్టం వ‌చ్చిన‌ప్పుడు వ‌స్తూ, వెళుతున్నారని దస్తగిరి ఆరోపించాడు. ఏమైనా అడిగితే మా ప‌రిధి దాటి రాలేమ‌ని చెబుతున్నారని వ్యాఖ్యానించాడు. ఈ చిన్న పాటి విష‌యాన్ని సీబీఐ ఎస్పీకి చెప్పుకోమ‌ని స‌ల‌హా ఇస్తున్నారని దస్తగిరి ఆరోపించాడు. నాకు ఎక్క‌డ సెక్యూరిటీ ఇచ్చారో చెప్పాలని.. తనకు ఏమైనా జ‌రిగితే ఎవ‌రిది బాధ్య‌త‌ అని ప్రశ్నించాడు. 

ఇకపోతే.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతుంది. వివేకా హత్య కేసులో సాక్షులుగా ఉన్న దస్తగిరి, రంగన్నలకు భద్రత కల్పిస్తున్నట్టుగా పోలీసుశాఖ మార్చి 29న కడప కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. దస్తగిరి, రంగన్నలకు.. 1+1 గన్ మెన్‌లతో కూడిన భద్రత కల్పించామని తెలియజేసింది. దస్తగిరి, రంగన్నలకు భద్రత కల్పించాలని కోరుతూ కడప జిల్లా కోర్టులో సీబీఐ.. ఈ నెల ప్రారంభంలో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. విట్నెస్‌ ప్రొటెక్షన్‌ స్కీమ్‌-2018 మేరకు సాక్షులకు రక్షణ కల్పించాలని కోరింది. దీంతో ఇప్పటివరకు ఎలాంటి భద్రత కల్పించారో తెలియజేయాలని కడప జిల్లా  పోలీసు శాఖకు కోర్టు నోటీసులు జారీచేసింది. ఈ క్రమంలోనే పోలీసు శాఖ కౌంటర్ దాఖలు చేసింది. 

వివేకా హత్యకు సంబంధించిన సంచలన విషయాలను గతేడాది దస్తగిరి సిబిఐ అధికారులకు  ఓ వాంగ్మూలం ఇచ్చాడు. ఇందులో వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేస్తే ఎర్ర గంగిరెడ్డి రూ. 40 కోట్లు ఇస్తాడని Umashankar Reddy   తనకు చెప్పినట్టు దస్తగిరి పేర్కొన్నాడు. అంతేకాదు హత్య జరిగిన తర్వాత తనతో సహా కొంతమందిమి శంకర్ రెడ్డి ఇంటికి వెళ్లినట్లు అప్పుడు కూడా తమకేమీ సమస్య రాకుండా ఎర్ర గంగిరెడ్డి చూసుకుంటారని శంకర్ రెడ్డి హామీ ఇచ్చారని దస్తగిరి పేర్కొన్నాడు. 

ఎర్ర గంగిరెడ్డి, Sunil Yadav, గుజ్జుల ఉమాశంకర్‌రెడ్డితో కలిసి వివేకాను హత్య చేసినట్టు దస్తగిరి  సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. బెంగళూరు ల్యాండ్ వివాదంలో వాటా ఇవ్వకపోవడంపై ఆగ్రహంతో ఎర్ర గంగిరెడ్డి పగ పెంచుకున్నారని చెప్పారు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గంగిరెడ్డి మోసం చేశారని మీ సంగతి తేలుస్తానంటూ గంగిరెడ్డి, అవినాష్‌లకు వివేకా వార్నింగ్‌ ఇచ్చినట్టు దస్తగిరి ఆ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. 

MLC ఎన్నికల్లో ఓటమి తర్వాత అవినాష్‌ ఇంటి దగ్గర వాగ్వాదం జరిగిందని స్టేట్‌మెంట్‌లో తెలిపారు. తనను కావాలనే ఓడించారని, మీ కథ తేలుస్తానంటూ అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి, డి.శంకర్‌రెడ్డిలకు వివేకా వార్నింగ్‌ ఇచ్చినట్లు దస్తగిరి  ఆ వాంగ్మూలంలో పేర్కొన్నారు. సీఆర్‌పీసీ 164(1) సెక్షన్ కింద ప్రొద్దుటూరు కోర్టులో స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. హత్యలో నలుగురు పాల్గొన్నట్టు కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో ఉంది. ఎర్ర గంగిరెడ్డి  , సునీల్ యాదవ్, గుజ్జుల ఉమాశంకర్‌రెడ్డితో కలిసి వివేకాను హత్య చేసినట్టు దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!