బీజేపీ కోసం పవన్ చివరి యత్నాలు .. కలిసొస్తే సరే, లేకుంటే ఈ నెల 14న టీడీపీ జనసేన తొలి అభ్యర్ధుల జాబితా ..?

By Siva Kodati  |  First Published Feb 4, 2024, 4:05 PM IST

ఈ నెల 14న టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్ధుల జాబితా వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 10 తర్వాత పవన్ కళ్యాణ్ హస్తినకు వెళ్లనున్నారు. బీజేపీ కలిసొచ్చినా , రాకున్నా ఫిబ్రవరి 14న ఇరుపార్టీల ఉమ్మడి అభ్యర్ధుల జాబితాను ప్రకటించాలని ఫిక్స్ అయినట్లుగా టాక్. 


ఈ నెల 14న టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్ధుల జాబితా వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఆదివారం ఉండవల్లిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దాదాపు మూడు గంటల పాటు వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. అలాగే ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి పర్యటనల అంశం కూడా చర్చకు వచ్చినట్లుగా సమాచారం. బీజేపీతో పొత్తు విషయం తేల్చేందుకు పవన్ త్వరలో ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ తర్వాతే సీట్ల ప్రకటన చేసే అవకాశం వుంది. ఈ నెల 10 తర్వాత పవన్ కళ్యాణ్ హస్తినకు వెళ్లనున్నారు. బీజేపీ కలిసొచ్చినా , రాకున్నా ఫిబ్రవరి 14న ఇరుపార్టీల ఉమ్మడి అభ్యర్ధుల జాబితాను ప్రకటించాలని ఫిక్స్ అయినట్లుగా టాక్. 

అభ్యర్ధుల ఎంపికై వీరిద్దరూ పలుమార్లు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు చర్చలు జరపడంతో పాటు వేర్వేరుగా కసరత్తు చేశారు. సీట్ల సర్దుబాటుపై అధికారిక ప్రకటన ఎప్పుడెప్పుడా అని ఇరుపార్టీల నేతలు , కార్యకర్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే పలువురు నేతలు త్యాగాలకు సిద్ధం కావాలని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా చెందిన నేతలకు చంద్రబాబు ఇప్పటికే సూచించారు. సీట్లు సర్దుబాటులో టికెట్లు ఇవ్వలేని పక్షంలో పార్టీలో , ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తామని చంద్రబాబు నాయుడు తెలిపారు. 

Latest Videos

జనసేనకు 28 సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు సూత్రప్రాయంగా అంగీకరించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే జనసేనాని మాత్రం 45 సీట్లు కావాలని అడుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఉభయగోదావరి, విశాఖ, గుంటూరు జిల్లాల్లో ఎక్కువ సీట్లను పవన్ కళ్యాణ్ ఆశిస్తున్నట్లుగా సమాచారం. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 2 నుంచి 3 సీట్లను తమకు కేటాయించాలని జనసేనాని పట్టుబడుతున్నట్లుగా తెలుస్తోంది. ఎంపీ సీట్ల విషయంలో పెద్దగా పట్టు పట్టని పవన్.. అసెంబ్లీ టికెట్ల విషయంలో మాత్రం బెట్టు వీడటం లేదని టాక్. 35 అసెంబ్లీ స్థానాలనైనా ఫైనల్ చేయాలని జనసేనాని కోరుతున్నారట. 

ఈ నెల చివరి వారం నాటికి టీడీపీ, జనసేన పొత్తుపై క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చి నుంచి ఇరు పార్టీల నేతలు, కేడర్ ప్రచారంలో దూసుకుపోవాలని ఇద్దరు నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. మరి పొత్తు పంచాయతీకి రెండు పార్టీలు చెక్ చెబుతాయా లేదంటే ఈ సస్పెన్స్ ఇంకొంత కాలం కొనసాగుతుందా అన్నది తెలియాల్సి వుంది.

click me!