తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ మరోసారి సమావేశం అయ్యారు.
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల హడావిడి మొదలయ్యింది. ఇప్పటికే అధికార వైసిపి ఇంచార్జీల పేరిట అసెంబ్లీలో పాటు లోక్ సభ అభ్యర్థుల ప్రకటనను పూర్తిచేసింది. దీంతో ప్రతిపక్ష టిడిపి-జనసేన కూటమి కూడా స్పీడ్ పెంచింది. ఇప్పటికే సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో, ఎలక్షన్ మేనేజ్ మెంట్ తదితర అంశాలను చర్చించేందుకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్ పలుమార్లు సమావేశమయ్యారు. తాజాగా మరోసారి ఇరుపార్టీల అగ్రనేతలు భేటీ అయ్యారు.
వీడియో
నిన్న(శనివారం) రాత్రి మంగళగిరిలోకి జనసేన కార్యాలయానికి చేరుకున్నారు పవన్ కల్యాణ్. ఇవాళ ఉదయం చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుండి ఉండవల్లిలోని నివాసానికి చేరుకున్నారు. ఈ విషయంపై సమాచారం అందినవెంటనే చంద్రబాబు నివాసానికి బయలుదేరారు పవన్. ఉండవల్లి నివాసానికి చేరుకున్న ఆయనకు ఏపీ టిడిపి అధ్యక్షులు అచ్చెన్నాయుడు సాదర స్వాగతం పలికి చంద్రబాబు వద్దకు తీసుకెళ్ళారు. ప్రస్తుతం ఇద్దరు నేతలు ఎన్నికలకు సంబంధించిన అంశాలపై చర్చించుకుంటున్నట్లు సమాచారం.
ఈ భేటీతో ఇరుపార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఏదయినా సందిగ్ద పరిస్థితి వుంటే పార్టీ శ్రేణులతో చర్చించి మరోమారు సమావేశమయ్యే అవకాశాలున్నాయి. ఉమ్మడి మేనిఫెస్టోపై చంద్రబాబు, పవన్ చర్చించనున్నారు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో అన్ని అంశాలపై క్లారిటీకి రావాలన్నది ఇరువురు నేతల అభిప్రాయంగా తెలుస్తోంది. అందువల్లే భేటీ అయినట్లు ఇరు పార్టీల నాయకులు చెబుతున్నారు. చర్చించిన అన్ని అంశాలపై అగ్రనేతలిద్దరూ ఏకాభిప్రాయానికి వస్తే సమావేశం ముగిసిన తర్వాత, లేదంటే రేపు మీడియా సమావేశం వుండే అవకాశాలున్నాయి. ఈ సమావేశంలో ఉమ్మడిగా తీసుకున్న కీలక నిర్ణయాలను వెల్లడించనున్నారు.
Also Read AP BJP: దూకుడు పెంచిన బీజేపీ.. టీడీపీ-జనసేనతో దూరమేనా?.. కమలం పార్టీ ప్లాన్ ఇదేనా?
అభ్యర్థులు ఎంపీక, ఉమ్మడి మేనిఫెస్టోపై ఈ భేటీతో పూర్తి క్లారిటీ వస్తుందని ఇరుపార్టీల నాయకులు చెబుతున్నారు. ఫిబ్రవరి 10 తర్వాత టీడీపీ, జనసేన అభ్యర్థుల ప్రకటన వుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో టిడిపి-జనసేన కూటమిలో బిజెపితో పాటు ఇతర పార్టీలను చేర్చుకునే అంశంపైనా చంద్రబాబు, పవన్ ఓ నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది.
ఈ భేటీ అనంతరం దేశ రాజధాని న్యూడిల్లీకి వెళ్లనున్న పవన్ బిజెపి అగ్రనాయకత్వంతో చర్చించే అవకాశాలున్నాయి. ఈ పర్యటనతో బిజెపితో పొత్తు విషయంలో క్లారిటీ రానుంది. బిజెపిని కలుపుకుని పోతారా లేక దూరంపెట్టి టిడిపి-జనసేన మాత్రమే ఎన్నికలకు వెళతాయా అన్నది త్వరలోనే తేలనుంది. బిజెపితో పొత్తుపై స్పష్టత వస్తే సీట్ల సర్దుబాటు కూడా కొలిక్కి రానుంది.