
విశాఖపట్నం : కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో ప్రమాదాలు సృష్టిస్తున్నాయి. నదులు, వాగులు వంకలు పొంగుపోర్లడంతో పాటు సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు నిండుకుండల్లా మారాయి. వరద నీరు చుట్టుముట్టడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ప్రాణభయంతో వణికిపోతున్నారు. ఇలా వరదనీటితో ప్రమాదకరంగా ప్రవహిస్తున్న మున్నేరులో 13 మంది వ్యవసాయ కూలీలు, రైతులు చిక్కుకున్నారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలంలోని కంచెల గ్రామానికి చెందిన 11మంది వ్యవసాయ కూలీలు గురువారం ఉదయం చెరకు తోటలో పనికి వెళ్లారు. ఈ క్రమంలోనే మున్నేరులో వరద ప్రవాహం పెరిగడంతో కూలీలంతా వరదనీటిలో చిక్కుకున్నారు. వారిని రక్షించడానికి ప్రయత్నించిన మరో ఇద్దరు కూడా వరదనీటిలో చిక్కుకుపోయారు. అంతకంతకు మున్నేరు ప్రవాహం పెరగడంతో వరదనీటిలో చిక్కుకున్న 13మంది ప్రాణభయంతో వణికిపోయారు.
వీడియో
గ్రామస్తుల సమాచారంతో అధికారులు ఎన్డిఆర్ఎఫ్ బృందాలతో సహాయక చర్యలు చేపట్టారు. స్థానిక ఎమ్మెల్స మొండితోక అరుణ్ కుమార్ కూడా ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఎట్టకేలకు మున్నేరులో చిక్కుకున్న 13మందిని సురక్షితంగా కాపాడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Read More ఐతవరం వద్ద హైద్రాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై మున్నేరు వరద: వాహనాల మళ్లింపు
అధికారులను అప్రమత్తం చేయడమే కాదు స్వయంగా దగ్గరుండి సహాయకచర్యలను పర్యవేక్షించిన ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ కూలీలు కృతజ్ఞతలు తెలిపారు. తాము ప్రాణాలతో బయటపడతామని అనుకోలేదని... ప్రాణాలకు తెగించి తమను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కాపాడారని అన్నారు. కూలీలంతా సురక్షితంగా ఒడ్డుకు చేరడంతో వారి కుటుంబాల్లో ఆనందాలు విరిసాయి.
ఇదిలావుంటే మునుగోడు లంకలో 14 మంది గొర్రెల కాపరులు చిక్కుకున్నారు. మున్నేరుకు వరద పోటెత్తడంతో చందర్లపాడు మండలం విపరింతలపాడు వద్ద కాపరులతో పాటు వెయ్యి గొర్రెలు చిక్కుకున్నాయి. వీరిని కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షితంగా కాపాడారు.
ఇక పెనుగంచిప్రోలు వద్ద ఉన్న బ్రిడ్జి పై నుండి మున్నేరు వరద నీరు ప్రవహిస్తుండటంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య రాకపోకలను అధికారులు నిలిపివేశారు. వత్సవాయి మండలం లింగాల, పెనుగంచిప్రోలు బ్రిడ్జిలపై నుండి మున్నేరు వరద నీరు ప్రవహిస్తుంది.