రోడ్దు ప్రమాదంలో ఐదుగురు విద్యార్ధులు మృతి

First Published Dec 28, 2017, 11:52 AM IST
Highlights
  • గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూడి వద్ద గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూడి వద్ద గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రగాయాలతో గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతిచెందిన వారిలో నలుగురు పదో తరగతి విద్యార్థులు. ప్రత్యేక తరగతుల కోసం వీరంతా పేరేచర్లలోని ఇంటెల్ పాఠశాలకు రోజూ ఆటోలో వెళ్ళి వస్తుంటారు. అదే విధంగా గురువారం ఉదయం కూడా వెళుతున్నారు.

వీరందరూ ఆటోలో వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో ఫిరంగిపురం మండలం వేమవరం గ్రామానికి చెందిన గాయత్రి, రేణుక, శైలజ అనే విద్యార్థినులు, ఆటో డ్రైవర్ ధనరాజ్ ఘటనాస్థలిలో మృతిచెందారు. కార్తీక్ రెడ్డి అనే మరో విద్యార్థి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో తుదిశ్వాస విడిచాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వైష్ణవి, భాను, శిరీష అనే మరో ముగ్గురు విద్యార్థినులను గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స ఆందిస్తున్నారు.

ఈ ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు ఆస్పత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. మృతదేహాలను నరసరావుపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ పిల్లలను కోల్పోయిన విషాదంతో తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.

ప్రమాదం సంఘటనపై సభాపతి కోడెల శివప్రసాదరావు, రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇదే ప్రాంతంలో గతంలో కూడా పలు ప్రమాదాలు జరిగాయని స్ధానికులు ఆరోపిస్తున్నారు. ప్రమాదాల నివారణకు సరైన భద్రతా చర్యలు చేపట్టకపోవడం వల్లే ఇపుడీ ఘోరప్రమాదం సంభవించిందని విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

click me!